Mandali Buddha Prasad: కృష్ణాజిల్లా మోపిదేవి తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ బైఠాయించారు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంతవరకూ దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు మండలి బుద్దప్రసాద్.. తహసీల్దార్‌కు వినతి పత్రం ఇచ్చి దీక్షకు కూర్చున్నారు.
గతంలో రైతులకు ఎలాంటి సమస్య వచ్చినా ప్రభుత్వాలు స్పందించి వారికి అండగా నిలిచేవని.. ముఖ్యమంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు తామున్నామనే భరోసా కల్పించే వారిని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం.. రైతులు ఎంత నష్టపోయినా, వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా ఇంటి నుంచి కదలని ఏకైక వ్యక్తి అని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను ఆర్బికేల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం ప్రతి దానికి రైతులు పోరాటం చేయాల్సి వస్తుందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయడానికి, డబ్బు కోసం ఇలా ప్రతిదానికి పోరాటం చేయడానికే సమయం సరిపోతుందని అన్నారు.
రాష్ట్రంలో అసలు ఉద్యానవన శాఖ ఉందా అనే అనుమానం కలుగుతుందని బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవి మండలంలో రైతుల సమస్య స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని బుద్ధప్రసాద్ అన్నారు.