విజయవాడ జక్కంపూడి కాలనిలో సుమారు 70 లక్షలతో నిర్మించిన ఆధునిక చేపల మార్కెట్ ప్రారంభానికి నోచుకోవటం లేదు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండాల్సిన ప్రభుత్వ నిర్మాణాలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి. దుకాణాల కేటాయింపు, మార్కెట్ ప్రారంభంఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి.నిర్మాణాలు పూర్తైనా.. సంవత్సర కాలంగా ఎలాంటి కార్యకలాపాలు జరగటం లేదు.
కృష్ణా పుష్కరాల సమయంలో నది పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉండే కుటుంబాలకు జక్కంపూడిలో ఇల్లు నిర్మించి వారికి కేటాయించారు. వీరిలో ఎక్కవమంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే.. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలో సుమారు 20 వేల మంది నివాసముంటున్నారు.
కృష్ణా నదిలో చేపలు పట్టుకుని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలు ఉంటున్నాయి. వీరికి ఉపయోగకరంగా అరకోటికి పైగా నిధులతో ఆధునిక చేపల మార్కెట్నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ఇప్పుడీ ప్రాంతమంతా ఆసాంఘిక కార్యక్రమాలు చేసే వారికి నిలయంగా మారింది.