Farmers are Facing Difficulties in Grain Sales: ధాన్యం కొనండి మహాప్రభో అంటూ అన్నదాతలు ఆర్తనాదం చేస్తున్నారు. పకృతి దోబూచులాటలో ప్రభుత్వం ప్రకటనలకే పరిమితం కాగా అలంకారప్రాయంగా ఆర్బీకే(రైతు భరోసా కేంద్రాలు RBK) లు తయారయ్యాయి. ధాన్యం నూర్పిడి చేసుకుని రోడ్డు ప్రక్కన రాశులు ఆరబెట్టుకుని అమ్మకానికి ఎదురు చూస్తున్న రైతుకు తేమ శాతం 20 లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని తెలపడంతో ఒక్కసారిగా రైతులు అయోమయ స్థితిలో పడ్డారు.
ధాన్యాన్ని రోడ్డుపై వేసి ఆందోళనకు దిగిన కృష్ణా జిల్లా రైతులు
కృష్ణా జిల్లా, దివిసీమలో ఘంటసాల మండలం -17402 , చల్లపల్లి మండలం - 14967 , మోపిదేవి మండలం -14580 ఎకరాలు పంట పండిస్తున్నారు. మొత్తం ఈ మూడు మండలాల్లో 46,949 ఎకరాల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ మండలాల్లో 1061 వరి రకం ఎక్కువగా సాగుచేస్తారు. ఇప్పటికే ఈ మూడు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో వరి పంట నూర్పిడి చేసి ధాన్యం రాశులు రోడ్డు ప్రక్కన, ఇతర చోట్ల అరబెట్టుకున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో వరి పంట కోత దశకు రావడానికి మరికొంత సమయం పడుతుంది.
"కోత కోసే మిషన్‌కు ప్రస్తుతం గంటకు రూ.3200 చెల్లిస్తున్నాం. కొన్ని చోట్ల కులీలతో కోత కోయిస్తే ఎకరాకు రూ.4500గా ఖర్చు అవుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫానుతో భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేయడంతో మా గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. తేమ శాతంలో రైతుకు మినహాయింపు ఇచ్చి, రైతు వాహనం ద్వారా ధాన్యాన్ని మిల్లుకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి ".- రైతులు