ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నగదు బదిలీ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల నిరసనలు - రైతుల ఆందోళనలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ మోటార్లకు నగదు బదిలీ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్నే అమలు చేయాలని రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

farmers agitation
నగదు బదిలీ పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నిరసనలు

By

Published : Sep 14, 2020, 9:48 PM IST

విజయవాడలో...
ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలనీ.. నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయవాడ గుణదల విద్యుత్ సౌధా వద్ద రైతు, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాజశేఖర్​రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకానికి.. ఆయన తనయుడే తూట్లు పొడుస్తున్నాడని రైతు సంఘం నాయకులు విమర్శించారు. నగదు బదిలీ పథకాన్ని రద్దు చేయాలనీ.. లేకపోతే దశలవారీగా ఉద్యమం తప్పదని నేతల హెచ్చరించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో..
వ్యవసాయ విద్యుత్​ మీటర్లు బిగించి.. రైతుల మెడలకు ఉరితాళ్లుగా మార్చవద్దని... పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు విద్యుత్ భవనం ముందు రైతు సంఘాల నేతలు, రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ విద్యుత్​కు నగదు బదిలీ జీవో 22 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పొడిచేందుకే... ప్రభుత్వం ఈ జోవోను తీసుకువచ్చిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇవ్వవలసిన జీఎస్టీ పన్ను వాటా ఇవ్వకుండా... అప్పులు తెచ్చుకోమంటుందని అన్నారు. దానికోసం అనుమతి ఇవ్వాలంటే వ్యవసాయ విద్యుత్​కి మీటర్లు పెట్టాలని షరతు విధించిందని ఆరోపించారు. 1500 కోట్ల అప్పుకోసం... 500 కోట్లు ఖర్చు పెట్టి మీటర్లు పెట్టటం దారుణమని అన్నారు. కరోనా కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని... ఇటువంటి పరిస్థితుల్లో విద్యుత్ సంస్కరణల అమలు వద్దని కోరారు. ఉచిత విద్యుత్ అనేది రైతుల హక్కు అనీ.. ఆ హక్కును కాలరాస్తే ఉద్యమం తప్పదని అన్నారు.

విశాఖ జిల్లాలో...

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యవసాయ మోటార్లకు నగదు బదిలీ పథకాన్ని రద్దు చేసి, పాత పద్దతిలోనే ఉచిత విద్యుత్ ఇవ్వాలని విశాఖ జిల్లా దేవరాపల్లిలో రైతులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఉరితాళ్లు బిగించుకొని వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. నగదు బదిలీ పథకం రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయపై.. పెనుభారం పడేలా నగదు బదిలీ పథకం వద్దని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం అమలుకు అడుగులు వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిహెచ్.రాజు, రైతులు పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాలో...
ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ఉరవకొండ పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 22ను వెనక్కి తీసుకోవాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతూ రైతు సంఘం నాయకులు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం నేరుగా సబ్సిడీ ఇస్తోందని అదేవిధంగా కొనసాగించాలని కోరారు. విద్యుత్ నగదు బదిలీ పథకం వలన రైతులపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జీవో నెంబర్ 22ని వెనక్కి తీసుకొని ఉచిత విద్యుత్ కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:విజయవాడ ఏటీఎం సెంటర్​లో చోరీకి విఫలయత్నం

ABOUT THE AUTHOR

...view details