చెవిటికల్లు వద్ద సహాయ చర్యలు..లారీల వెలికితీత కృష్ణా కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద చిక్కుకున్న లారీల బయటకు తీశారు. చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా కోసం వెళ్లిన 132లారీలు, 4ట్రాక్టర్లు ఒక్కసారిగా పెరిగిన వరద కారణంగా శనివారం చిక్కుకున్నాయి. మొత్తం 132 లారీలు, 4 ట్రాక్టర్లను క్రేన్లు, యంత్రాల సాయంతో అధికారులు బయటకు తీశారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. విజయవాడ సబ్ కలెక్టర్ పవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగాయి.
కంచికచర్ల మండలం చెవిటికల్లు ఇసుక ర్యాంపులోకి ఇసుక రవాణా కోసం వందకు పైగా లారీలు వెళ్లాయి. ఉన్నట్లుండి ఒక్కసారిగా వరద రావడంతో లారీలన్నీ ర్యాంపులోనే నిలిచిపోయాయి. ఇసుక ర్యాంపులోకి వెళ్లే రహదారి వరదనీటికి కొట్టుకుపోవడంతో వెనక్కి తిరిగి రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పడవల ద్వారా డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. వరద తగ్గడంతో లారీలను వెలికితీసే చర్యలను ప్రారంభించారు.
నిత్యం ఇసుక రవాణా.. అయినా రోడ్డు మార్గం కరవు..
శనివారం తెల్లవారుజామున ఒక్కసారిగా పోటెత్తిన వరదలో లారీ డ్రైవర్లకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. లారీలు వెనక్కి తిరిగి వచ్చే రోడ్డు మార్గం లేకపోవడంతో వరద నీటిలోనే చిక్కుకున్నాయి. రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక అధికారులు పడవల ద్వారా డ్రైవర్లను క్లీనర్లను ఒడ్డుకు చేర్చగలిగారు.
ఇసుక కాంట్రాక్ట్ సంస్థ జె.పి.పవర్ వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ ప్రతిరోజూ వందలాది లారీలతో ఇసుక రవాణా చేస్తున్నప్పటికీ.. కనీసం సరైన రోడ్డుమార్గం ఏర్పాటు చేయకపోవడం వల్ల అటు లారీ డ్రైవర్లు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నుంచి చెవిటికల్లు మీదుగా కృష్ణానది క్వారీకి వచ్చే రోడ్డు అధ్వానంగా తయారైంది. కనీసం నడిచేందుకు సరైన రోడ్డుమార్గం లేదు. అర్థరాత్రి నుంచి వరద నీటిలో చిక్కుకున్న లారీ డ్రైవర్లు, క్లీనర్లు, కూలీలు అనేక అవస్థలు పడుతున్నప్పటికీ జె.పి.వపర్ వెంచర్స్ కంపెనీ.. వారి బాగోగుల గురించి పట్టించుకోలేదు. వరదలో చిక్కుకున్న లారీలు వరదకు దెబ్బతింటున్నాయని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత కథనం:LORRIES STRANDED IN FLOOD: ఇసుక కోసం వెళ్లి కృష్ణా నదిలో చిక్కుకున్న 132 లారీలు