ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజర్వేషన్ల విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. అందువల్ల వైద్య విద్యా సంస్థల్లో అదనంగా సీట్లు కేటాయించాలని జాతీయ వైద్య మండలి నిర్ణయించింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.
వైద్య విద్యలో ఈబీసీ రిజర్వేషన్ కోటా అమలు! పీజీ వైద్య సీట్ల పెంపునకు వీలుగా ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాలను... జాతీయ వైద్య మండలి కోరింది. ఇదే విధానాన్ని ఎంబీబీఎస్ కీ వర్తింపచేయాలని యోచిస్తోంది. ఈమేరకు ఎంసీఐతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి కాకుండా నేరుగా కళాశాలలకు ఎంసీఐ నుంచి లేఖలు రావటంతో.. కళాశాలల యాజమాన్యాలు స్పష్టత కోరుతున్నాయి. కాలేజీల్లోని పరిస్థితులు, పడకలు, నిధుల కేటాయింపు, ఇతర అంశాలపై అధ్యయనం జరగకుండా ప్రతిపాదనలు ఎలా పంపగలమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పీజీ వైద్య విద్య సీట్ల పెంపు ప్రతిపాదనలపై తమకు ఎలాంటి సమాచారం లేదని.. వైద్య విద్య సంచాలక కార్యాలయ వర్గాలు వివరించాయి. ఆంధ్ర వైద్య కళాశాలలో 29 విభాగాల్లో 205 సీట్లే ఉన్నాయి. విభాగాల వారీగా అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఈనేపథ్యంలో 10 శాతం రిజర్వేషన్ల విధానాన్ని ఎలా అమలు చేస్తారనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈబీసీ కోటాలో మాదిరిగానే ఇతర రిజర్వేషన్ కోటాలోనూ సీట్లు పెరుగుతాయని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి.