Cyber frauds in Telangana : 'మిత్రమా నా దగ్గరున్న డబ్బుతో ఒక అద్భుతం జరిగింది. బిట్ కాయిన్లో రూ.5 వేలు పెట్టుబడి పెడితే మూడు గంటల్లోనే రూ.లక్ష అయ్యింది. కావాలంటే కింద ఉన్న స్క్రీన్షాట్లు చూడండి. ఈ లింకు తెరిచి పెట్టుబడి పెట్టండి' అని మీకు తెలిసిన వారి నుంచి సందేశం వస్తే.. ఏంటని అడగకుండా లింకు తెరిచి పెట్టుబడి పెడితే అంతే సంగతులు. ఎందుకంటే మోసం చేయడంలో సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్న ఇన్స్టాగ్రామ్ ఖాతా హ్యాక్‌కు గురైతే పోతే పోయింది.. కొత్తది ప్రారంభించవచ్చని తేలిగ్గా వదిలేశారో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతోంది.
హ్యాక్‌కు గురయ్యే ఖాతాల్లో ఎక్కువగా మహిళలు, యువతులకు సంబంధించినవే ఉంటున్నాయి. సైబర్ నేరగాళ్లు వ్యూహాత్మకంగానే మహిళల ఖాతాలను ఎంచుకుంటున్నారు. యువతులు, మహిళలు రీల్స్ ఎక్కువగా పోస్టు చేస్తుంటారు. వీరి ఖాతాను అనుసరించే వాళ్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. వారి ఖాతాలను తేలిగ్గా హ్యాక్ చేస్తున్నారు. వాళ్ల ఫొటోలు, వీడియోలు సేకరించడంతోనే ఆగడం లేదు. పెట్టుబడులు పెడితే లాభాలు వస్తున్నాయంటూ వారి ఖాతా నుంచి ఫాలోవర్లకు నకిలీ లింకులు పంపిస్తున్నారు. పెట్టుబడులు పెట్టాలంటూ, క్రిప్టో కరెన్సీలో మదుపు చేస్తే లాభాలంటూ స్నేహితులకు సందేశం పంపిస్తారు.