ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విభజనతో నష్టపోయాం... ప్రత్యేక హోదా ఇవ్వండి' - PM Modi

హస్తినలో పర్యటిస్తున్న సీఎం జగన్... ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులు, విభజన హామీలు నెరవేర్చాలని ప్రధానిని కోరారు. రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రధాని వివరించిన జగన్... నిధుల కేటాయింపుపై మోదీకి వినతి పత్రం అందించారు.

ప్రధానితో సీఎం జగన్

By

Published : Aug 6, 2019, 9:14 PM IST

Updated : Aug 6, 2019, 9:53 PM IST

'విభజనతో నష్టపోయాం... ప్రత్యేక హోదా ఇవ్వండి'

దిల్లీలో పర్యటిస్తున్న సీఎం జగన్...ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మోదీతో ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన అంశాలపై ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. గత ఐదేళ్లలో జరిగిన అసమానతలు సరిదిద్దేలా చర్యలు చేపట్టినట్లు ప్రధానికి వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా అనేక కార్యక్రమాలు చేపట్టామన్న జగన్‌...సామాజిక భద్రత కల్పించేలా పలు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు.

''మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామికాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాము. పారదర్శకత, అవినీతిరహిత పాలన కోసం పలు సంస్కరణలు చేపట్టాం. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలు. ఐదేళ్లుగా రాష్ట్ర విద్యుత్‌ రంగంలో అస్తవ్యస్త విధానాలు అనుసరించారు. పవన విద్యుత్‌ కంపెనీలతో అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. పరిమితి దాటి 23.6 శాతం వరకు సంప్రదాయేతర విద్యుత్‌ కొనుగోలు చేశారు. వీటివల్ల ఏటా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు రూ.2,654 కోట్ల నష్టం వచ్చిందని '' సీఎం జగన్ అన్నారు.

రోజుకు 7 కోట్లు నష్టం
డిస్కంలు ప్రతిరోజు రూ.7 కోట్లు నష్టపోతున్నాయని సీఎం జగన్‌ పేర్కొన్నారు. పర్యావరణ కాలుష్యాన్ని పట్టించుకోకుండా కొందరికి లబ్ధి చేకూర్చేలా ఒప్పందాలు చేసుకున్నారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఉద్దేశపూర్వకంగా గ్రిడ్‌ స్టెబిలిటీని కూడా పణంగా పెట్టారని జగన్‌ ఆరోపించారు. గత ప్రభుత్వ విధానాలతో రూ.20 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. విద్యుత్‌ వినియోగదారులపై భారం మోపబోమని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయన్నారు.

విభజనతో రాష్ట్ర ఆదాయం కోల్పోయాం
2014-15 నాటికి రూ.97వేల కోట్లు ఉన్న అప్పులు.. 2018-19 నాటికి రూ.2.58లక్షల కోట్లుకు చేరాయని సీఎం అన్నారు. వెనుకబడిన 7 జిల్లాలకు ఆరేళ్ల కాలానికి యాభై కోట్ల చొప్పున ఇప్పటికి రూ.2100 కోట్లు అందాల్సి ఉండగా, రూ.1050 కోట్లు మాత్రమే విడుదల చేశారని సీఎం...ప్రధానికి తెలియజేశారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం కేబీకే తరహాలో మిగిలిన రూ.23,300 కోట్ల నిధులు కేంద్రం కేటాయించాలన్నారు. పోలవరం ఎడమ కాలవ ద్వారా ఉత్తరాంధ్రలో చెరువులను అనుసంధానం కార్యక్రమానికి సహాయం చేయాలని కోరారు. గోదావరి, కృష్ణా అనుసంధానం ద్వారా కృష్ణా డెల్టాకే కాకుండా కరవుపీడిత రాయలసీమ ప్రాంతానికి జలాలు అందించి తాగునీరు, సాగునీటి కొరతను నివారించడానికి పూనుకున్నామన్న జగన్... ఈ అనుసంధానానికి కేంద్ర సహాయం చేయాలని కోరారు.

కేంద్రం సాయం అత్యవసరం
గోదావరి-కృష్ణా అనుసంధానానికి సాయం చేయాలన్న సీఎం...ఈ అనుసంధానం రెండు తెలుగు రాష్ట్రాలకూ పరస్పర ప్రయోజనకరమన్నారు. ఇంటింటికీ రక్షిత తాగునీటి కల్పించడానికి వాటర్‌ గ్రిడ్‌ తెస్తున్నామని ప్రకటించిన సీఎం... 2050 వరకూ ప్రజల అవసరాలను తీర్చిదిద్దేలా గ్రిడ్‌ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ గ్రిడ్​కు సుమారు రూ.60వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వీటికి తగురీతిలో కేంద్రం సాయం చేయాలన్నారు.

మినహాయింపులు ఇవ్వండి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని సీఎం జగన్... ప్రధాని మోదీని మరొకసారి కోరారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని విభజించారన్న జగన్... రాష్ట్ర ఆర్థిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు రాయితీలు ఇవ్వాలన్నారు. 10 ఏళ్లపాటు జీఎస్టీ మినహాయింపు, 10ఏళ్లపాటు ఇన్‌కంట్యాక్స్‌ మినహాయింపులు, 10 ఏళ్లపాటు 100శాతం ఇన్సూరెన్స్‌ ప్రీమియం రీయింబర్స్‌మెంట్, రెవిన్యూ లోటు రూపేణా రూ.22,948 కోట్లను పూడ్చాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తిచేశారు.

పోలవరం, కడప స్టీల్​ ప్లాంట్లకు సాయం
పోలవరం ప్రాజెక్టు కోసం గతంలో ఖర్చుచేసిన రూ. 5,103 కోట్లను రీయింబర్స్‌ చేయాలన్న జగన్...ఈ ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ, పునరావాసం కోసం రూ.16వేల కోట్లు మంజూరు చేయాలని ప్రధానికి వినతిపత్రం అందించారు. పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిన విధంగా కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగ్గరాజపట్నం వద్ద పోర్టును ఏర్పాటు చేయాలన్నారు. దుగ్గరాజపట్నం వీలుకాకపోతే రామాయపట్నం వద్ద పోర్టును నిర్మించాలని కేంద్రాన్ని కోరారు.

రాజధాని కోసం
రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇస్తామన్న రూ.2500 కోట్లలో మిగిలిన నిధులను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు. ఇప్పటికి రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. రాజధాని నిర్మాణం పేరుతో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టామన్న జగన్...విచారణ పూర్తయ్యాక శాస్త్రీయ దృక్పథంతో రాజధానిని నిర్మిస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి :'సీఎంకు వరద ప్రాంతాల్లో పర్యటించే సమయం లేదా?'

Last Updated : Aug 6, 2019, 9:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details