తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప విషయమని సీఎం జగన్ అన్నారు. లక్షా 40 వేల మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఓ రికార్డుగా తెలిపారు. ప్రతి 2 వేలమందికి ఒక సచివాలయం ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. ప్రతి గ్రామానికి 10 నుంచి 12 కొత్త ఉద్యోగాలు ఇవ్వగలిగామన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన సభలో సీఎం.. స్వయంగా వార్డు, సచివాలయ ఉద్యోగులకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా పలువురు భావోద్వేగానికి గురయ్యారు.
గ్రామ,సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి రెండు కళ్లు
నాలుగు నెలలు గడవకముందే 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. లంచాలు, వివక్ష లేని పారదర్శక పాలనకు సహకరించాలని కోరారు. ప్రజలకు సేవలందించడానికే ఈ ఉద్యోగాలు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అవినీతి లేని పాలన కోసం గ్రామాల్లో అందరూ ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. గ్రామ, సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి రెండు కళ్లుగా సీఎం అభివర్ణించారు. అధికారం చలాయించొద్దని ప్రజలకు అంతా సేవ చేయాలని సూచించారు.