పేదల పొట్టకొట్టే చర్యలకు వైకాపా నేతలు పాల్పడటం అమానుషమని తెదేపా నేతల టెలీ కాన్ఫరెన్స్లో చంద్రబాబు మండిపడ్డారు. ప్రభుత్వం తన నివాసాన్ని టార్గెట్ చేస్తోందని.. తన భద్రతపై ఆటలాడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తన భద్రతపై కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారని చెప్పారు. మా ఇంటిపైకి డ్రోను కెమెరాలను పంపటమేంటని ప్రశ్నించారు. డ్రోన్లు పంపటానికి కిరణ్ అనే వ్యక్తి ఎవరు అని మండిపడ్డారు. సీఎం జగన్ ఇంటిపై కూడా డ్రోన్లు నడుపుతారా అని ఎద్దేవా చేశారు. తెదేపా నేతలపై దాడులు చేస్తున్నారని... చిరుద్యోగులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దల పొట్టకొట్టే చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు.
వరద సహాయక చర్యలు చేపట్టటంలో ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు అన్నారు. బాధితులను ఆదుకోలేకపోయారని విమర్శించారు. వరద నిర్వహణ కార్యక్రమాలు చేపడితే నీళ్లు వచ్చేవి కాదన్నారు. ప్రభుత్వం ఒక్కసారైనా వరద నిర్వహణపై సమీక్ష చేయలేదని ఆరోపించారు. మన రాష్ట్రంలో వర్షాలు లేకపోయినా.. పక్కరాష్ట్రాల్లో కురిసిన వానలతో వరదలొచ్చాయని చెప్పారు. ప్రాజెక్టులో 3 లక్షల క్యూసెక్కుల నీటిని ముందే వదిలి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. తనపై అక్కసుతో ప్రజలను వరదల్లో ముంచుతున్నారని ధ్వజమెత్తారు. నీళ్లు నిల్వ ఉంచి.. అకస్మాత్తుగా విడుదల చేయడమేంటని ప్రశ్నించారు. ముంపు బాధితులకు వరద సహాయక చర్యలు చేపట్టలేదన్నారు. కనీసం వాళ్లను పట్టించుకున్నవారే లేరని తెలిపారు.