Chandrababu met CEC in Delhi about Irregularities of Votes: రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై హైలెవెల్ కమిటీ వేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఇవాళ దిల్లీలో సీఈసీ (Chief Election Commissioner)ని కలిసిన చంద్రబాబు.. రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలను వివరించారు. ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల ఐఏఎస్‌లను పంపి పరిశీలించాలని కోరారు. అనంతరం మీడియాతో చంద్రబాబు మాట్లాడుతూ ఓట్లు, ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, అక్రమాలకు పాల్పడిన అధికారులను జైలుకు పంపే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతల బృందం సీఈసీతో చర్చలు జరుపుతున్న సమయంలోనే వైసీపీ ఎంపీలు సైతం అక్కడకు చేరుకున్నారు. విజయసాయిరెడ్డి, పలువురు ఎంపీలు ఈసీ కార్యాలయానికి వచ్చారు.
తాము ఇచ్చిన వివరాలు వాస్తవమా..? వైసీపీ నేతలు ఇచ్చినవి వాస్తవమా తేలాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఓట్ల అక్రమాలపై హైలెవెల్ కమిటీ వేయాలని కోరామని చెప్పారు. తమ అభ్యంతరాలు, తాము చెప్పిన వివరాలను ఈసీ (Election Commission of India) అధికారులు సానుకూలంగా విన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని, సీఈసీ, ఇద్దరు కమిషనర్లను రాష్ట్రంలో పర్యటించాలని కోరామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉంది అని చంద్రబాబు వివరించారు.
Prathidwani: వివాదాస్పదంగా వాలంటీర్ వ్యవస్థ.. 'కలెక్టర్లకు సీఈసీ హెచ్చరిక'
కనిగిరిలో జీరో డోర్ నెంబర్ పేరుతో ఓట్లు చేర్చడంపై.. ఓటర్ల పేర్లు, డోర్ నెంబర్లు, గ్రామాల వివరాలను ఈసీకి అందజేశారు. ఓటర్ల వ్యక్తిగత డేటా వాలంటీర్లకు ఎందుకు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఓటర్ల వ్యక్తిగత డేటా(voters Personal data) ను ప్రైవేట్ సంస్థలకు ఇస్తున్నారన్న చంద్రబాబు.. ఏపీలో జరుగుతున్న ఓట్ల అక్రమాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీకి వచ్చి ఓట్ల అక్రమాలు పరిశీలించాలని, పూర్తిస్థాయి కమిటీ వేసి ఏపీలో ఓట్ల అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఓట్ల అక్రమాలను పూర్తిగా సరిదిద్దాలని, ఎన్నికలకు ముందే అన్నీ సరిచేయాలని ఈసీని కోరుతున్నాం అని స్పష్టం చేశారు.