Chandrababu fire on leaders: మాజీ కార్పొరేటర్ చెన్నుపాటి గాంధీపై వైకాపా శ్రేణులు దాడి చేసినా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తెదేపా లోక్‌సభ నియోజకవర్గాల అధ్యక్షులు సరైన రీతిలో స్పందించలేదని పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లలేదని వారిని నిలదీశారని, భవిష్యత్తులో ఇలాగే వ్యవహరిస్తే ఊరుకోనని హెచ్చరించినట్లు సమాచారం. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు బుధవారం సమావేశమై జిల్లాలో పార్టీ పరిస్థితిని సమీక్షించారు. వివిధ సంఘటనల్లో జిల్లా నేతలు సరిగా స్పందించడం లేదనీ, నాయకుల మధ్య సమన్వయం కరవైందని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరిగితే కలిసికట్టుగా ఎదుర్కోవాలని వారికి సూచించారు. పలువురు నాయకుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం జిల్లా కార్యాలయంలో సమావేశమవ్వాలని తెదేపా నేతలకు సూచించినట్లు, ఈ నెల 12, 13 తేదీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేయాలని, నియోజకవర్గాల్లో పర్యటించాలని వారిని ఆదేశించినట్లు తెలిసింది.
ఇకపై మీ జిల్లా వ్యవహారాలు నేనే చూస్తా
ఇకపై ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యవహారాలు తానే సమీక్షిస్తానని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. చంద్రబాబు కొంతకాలంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. పోలీసులు గృహనిర్బంధం చేస్తున్న సందర్భాల్లో కొందరు నేతల తీరుపై ఇటీవలే రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. గుడివాడలో తెలుగు మహిళల పోరాటాన్ని చూసైనా కొందరు నియోజకవర్గ బాధ్యులు తీరు మార్చుకోవాలని అధినేత హితబోధ చేసినట్లు తెలిసింది. జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోని పార్టీ నాయకత్వంపైనా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర, వర్ల రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, మచిలీపట్నం, విజయవాడ లోక్‌సభ నియోజకవర్గాల పార్టీ బాధ్యులు కొనకళ్ల నారాయణ, నెట్టెం రఘురామ్, అవనిగడ్డ శాసనసభ నియోజకవర్గ ఇన్‌ఛార్జి మండలి బుద్ధప్రసాద్, వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు పాల్గొన్నారు. విదేశీ పర్యటనలో ఉండటంతో దేవినేని ఉమామహేశ్వరరావు, బొండా ఉమామహేశ్వరరావు, దిల్లీ వెళ్లినందున ఎంపీ కేశినేని నాని సమావేశానికి హాజరుకాలేదు.