మోదీ ఓడితేనే.. దేశానికి విముక్తి: చంద్రబాబు - modi
దేశంలోని ఎన్డీయేతర నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఒక్క భాజపా నేతలపై మాత్రం దాడులు లేవు.. ఎందుకు?.. కుమార స్వామి హెలికాఫ్టర్‌లోనూ సోదాలు చేస్తారు. మోదీ పర్యటించిన హెలికాఫ్టర్‌లో తనిఖీ చేస్తే అధికారులను సస్పెండ్ చేస్తారు: చంద్రబాబు
జాతీయ స్థాయిలో భాజపాయేతర ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కర్నాటకలో తెలుగు వాళ్లు ఎక్కువగా ఉండే రాయచూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్- జేడీఎస్ కూటమి తరఫున చంద్రబాబు ప్రచారం నిర్వహించారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు పాల్గొన్న సభలో మోదీపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. కర్నాటకలో ఎన్డీయే వ్యతిరేక గాలి వీస్తోందని... ఇందులో భాజపా అభ్యర్థులు అందరూ చిత్తుగా ఓడిపోతారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. భాజపా ఆర్థిక విధానాలతో దేశం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో 50 లక్షల ఉద్యోగాలు పోయాయని దుయ్యబట్టారు. జీఎస్టీతో వ్యాపారులంతా దారుణంగా దెబ్బతిన్నారన్నారు. రఫేల్ డీల్‌తో రక్షణ శాఖలోనూ అవినీతికి పాల్పడిన వ్యక్తి మోదీ అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. తన కంటే గొప్ప నాయకుడు లేరని మోదీ అనుకుంటున్నారని... అది తప్పని రుజువు చేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు.