'తెలంగాణ తరహా ఉద్యమం చేసేలా సలహాలివ్వండి' - రాజధాని రైతుల ఆందోళన
అమరావతి రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని తెలంగాణ జనసమితి అధినేత ప్రొ . కోదండరామ్ కోరారు. రైతుల తాము చేసిన త్యాగాన్ని అన్ని వేదికలపై మరింత గట్టిగా మాట్లాడాలని సూచించారు. గుంటూరు జిల్లా అమరావతిలో ఆయన పరిస్థితులను పరిశీలించి ...ఐకాస నాయకులతో మాట్లాడారు.
రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల బాధలో న్యాయం ఉందని తెలంగాణ జనసమితి అధినేత ప్రొ . కోదండరామ్ అన్నారు. తన స్నేహితుడితో కలసి గుంటూరు జిల్లా తెనాలిలో ఓ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండగా తుళ్లూరు మండలం మల్కాపురంలోని ఓ హోటల్లో వారు బస చేశారు. రాజధాని రైతులు ఆయనను కలిసి... అమరావతిలో ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. ఈ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమం తరహాలో ఎలా తీవ్ర స్థాయికి తీసుకెళ్లాలో దిశా నిర్దేశం చేయమని కోరారు. ఈ సందర్భంగా రాజధానిలో నిర్మాణంలో ఉన్న పలు భవనాలు, భూ సమీకరణ, వాటి పురోగతి గురించి ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సమస్యలు సహేతుకంగా ఉన్నాయని..మీ త్యాగాల గురించి అన్ని వేదికలపై మరింత గట్టిగా మాట్లాడాలని ఆయన సూచించారు. అమరావతి అనే పడవ మునిగిపోయే పరిస్థితుల్లో ఉందని...ఒడ్డుకు చేరాలంటే మరో పడవ సాయం తీసుకోవాలన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యమాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉండాలన్నారు. రైతులకు న్యాయం చేయడం కోసం తాను కూడా పోరాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లడంలో తన సూచనలు , సలహాలు ఉంటాయన్నారు. నెలాఖరులోగా అమరావతిలో పూర్తి స్థాయిలో పర్యటిస్తానని అన్నారు.
ఇదీచూడండి.గుడివాడలో విద్యుత్ తీగలు తగిలి లారీ దగ్ధం
TAGGED:
capital farmers protest