వైకాపా ప్రభుత్వం హత్యా రాజకీయాలు విడనాడాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సూచించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తే దాడులు, హత్యలతో వైకాపా సర్కారు సమాధానం చెబుతోందని విమర్శించారు. తప్పును బయటపెడితే సరిదిద్దుకోకుండా... హత్యలు, దాడులకు పాల్పడటం కిరాతక చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ కార్యకర్తను చంపడం అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించారు. ప్రజలకు రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ దారుణంగా విఫలమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అడుగంటాయని మండిపడ్డారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
వైకాపా ప్రభుత్వం హత్యా రాజకీయాలు విడనాడాలి: సోము వీర్రాజు
వైకాపా ప్రభుత్వ హయాంలో దాడులు, హత్యలు పెరిగాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయ కార్యకర్త హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. వైకాపా సర్కారు ప్రోత్సాహం వల్లే హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయన్న ఆయన... రాష్ట్రంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థ విఫలమైందని మండిపడ్డారు.
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని సోము వీర్రాజు ఖండించారు. కొండబిట్రగుంట, పిఠాపురం, అంతర్వేదిలో హిందూ ఆలయాల ధ్వంసం కేసుల్లో నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందని అన్నారు. వైకాపా ప్రభుత్వ ప్రోత్సాహం కారణంగానే హిందూ ధర్మంపై దాడులు, విధ్వంసాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికైనా హిందూ ధర్మంపై దాడులు ఆపకుంటే హిందువుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
ఇదీచదవండి.