కృష్ణానదికి వరద ప్రవాహం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో పలు సమస్యలు మాత్రం అక్కడి ప్రజలను చుట్టుముట్టాయి. దాదాపు వారం రోజుల పాటు జనావాసంలో నీళ్లు చేరడంతో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్య సిబ్బంది ఓవైపు బ్లీచింగ్ చేస్తున్నా మరోవైపు ముంపు ప్రాంతాల్లో పందులు స్వైరవిహారం చేస్తుండటంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు
కృష్ణానదికి ఆనుకుని ఉండే కృష్ణలంక ప్రాంతంలోని పలు కాలనీల్లో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. మొన్నటి వరకు వరద ప్రభావంతో పనులు మానుకుని ఉన్నామని... ఇప్పుడు జ్వరాల బారిన పడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వరద ప్రవాహం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొన్న.... ఇప్పటికీ చాలామంది ఇళ్ళు పునరుద్ధరణకు నోచుకోలేదు.
వరద వచ్చినపుడు కంటితుడుపు చర్యగా వచ్చి చూసి వెళ్ళిన అధికారులు ఇప్పుడు పట్టించుకోవడం లేదంటున్నారు బాధితులు. పురుగులు పట్టిన బియ్యం, చాలీ చాలని పప్పులు, ఉల్లిపాయలు ఇచ్చి సరి పెట్టారని మండిపడ్డారు. ఇప్పటికైనా స్పందించి సాయం చేయాలనీ కోరుతున్నారు.