బీసీలను వెనకబడిన తరగతులుగా చూసే రోజుల నుంచి బీసీ అంటే వెన్నెముక వర్గాలుగా చూసే రోజులొచ్చాయని బీసీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ తెలిపారు. జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించే అవకాశం రావటం పట్ల మంత్రి వేణుగోపాల కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. వైకాపా ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న ఈ పథకం నేటి నుంచి అమలవుతోందని స్పష్టం చేశారు.
మొదటి విడతగా..
విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రితో పాటు ఏపీ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ ఏనాదయ్య.. సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మొదటి విడతగా 2,57, 040 మందికి ఈ పథకాన్ని వర్తింపచేస్తున్నామని పేర్కొన్నారు. వారికి రూ. 247.04 కోట్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఎవరి నుంచి సిఫార్సులు లేకుండా కేవలం అర్హత ఆధారంగానే లబ్ది చేకూరుతుందని మంత్రి వివరించారు.