కరోనా వ్యాప్తి దృష్ట్యా లాక్డౌన్ విధించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. కొన్ని సడలింపులతో ఇప్పుడు తిరిగి తెరుచుకుంటున్నాయి. అయితే ఏపీలో బార్లు తెరిచేందుకు అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. బార్లలో మద్యం, బీర్ల విక్రయాలకు అనుమతి లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. బార్లు, రెస్టారెంట్లలోని మద్యం, బీర్ బాటిళ్లను ప్రభుత్వ అవుట్ లెట్లకు తరలించి విక్రయించుకునేందుకు అనుమతిచ్చింది. కేవలం సీల్డ్ బాటిళ్లను మాత్రమే విక్రయించాలని అదేశాల్లో స్పష్టం చేసింది.
బార్లు తెరిచేందుకు అనుమతి నిరాకరణ..కానీ..!
రాష్ట్రంలో బార్లు తెరిచేందుకు అనుమతి నిరాకరించింది జగన్ ప్రభుత్వం. బార్లలో మద్యం విక్రయాలు జరపొద్దని తేల్చి చెప్పింది. కానీ, బార్లలో ఉన్న మద్యం సీల్ బాటిళ్లను సమీపంలోని రిటైల్ ఔట్లెట్ల ద్వారా విక్రయించే వెసులుబాటు కల్పించింది.
లాక్డౌన్ కారణంగా సుదీర్ఘ కాలం పాటు బార్లు మూసివేయడంతో.. బీర్ల కాల పరిమితి ముగిసిపోయే అవకాశం ఉందని వాటిని యధావిధిగా విక్రయించుకునే అవకాశం కల్పించాలని ఏపీ వైన్ డీలర్స్ అసోసియేషన్ కోరింది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఔట్ లెట్ల ద్వారా మాత్రమే బార్లు.. తమ ప్రాంగణంలో నిల్వ ఉన్న మద్యం, బీరు బాటిళ్లను విక్రయించుకోవాలని స్పష్టం చేసింది. సమీపంలోని ప్రభుత్వ ఔట్లెట్లకు తరలించి విక్రయాలు జరిపేందుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. ఈ మద్యం, బీర్ల విక్రయాలపై హోల్సేల్ ధర మాత్రమే బార్ యజమానులకు చెల్లిస్తారని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇదీ చదవండి:తోటి ఏనుగులతో పోరాడి గజరాజు మృతి!