ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Flash: మాజీ మంత్రి దేవినేని వర్గీయులపై రాళ్ల దాడి - Devineni Uma latest news

Devineni Uma
Devineni Uma

By

Published : Jul 27, 2021, 7:53 PM IST

Updated : Jul 28, 2021, 6:42 AM IST

19:51 July 27

దేవినేని ఉమపై రాళ్ల దాడి

మాజీ మంత్రి దేవినేని ఉమపై రాళ్ల దాడి

కృష్ణా జిల్లాలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఇది మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు లక్ష్యంగా రాళ్ల దాడి చేసేవరకూ వెళ్లింది. ఈ దాడిలో ఓ తెదేపా నేత కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఉమా కారు అద్దాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి.కొండూరు మండలంలో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొండపల్లిలో మైలవరం నియోజకవర్గ తెదేపా ముఖ్య కార్యకర్తల సమావేశం దేవినేని ఉమా అధ్యక్షతన మంగళవారం సాయంత్రం నిర్వహించారు. అనంతరం నాయకులంతా కొండపల్లి రిజర్వు అడవిలోకి వెళ్లారు. అక్కడ గతంలో అక్రమంగా తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, మీడియాతో మాట్లాడారు. అక్రమాలపై ఇంతవరకూ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు సీజ్‌ చేసిన వాహనాలు ఏమయ్యాయని నిలదీశారు. వైకాపా నేతలు కొండలు, గట్లను అక్రమంగా తవ్వుకున్నారని విమర్శించారు. వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ దృశ్యాలను తెదేపా కార్యకర్తలు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. విషయం తెలుసుకున్న వైకాపా కార్యకర్తలు గడ్డమణుగు వద్ద కాపు కాశారు. దాంతో పోలీసులు దేవినేని ఉమాను డొంకరోడ్డులో జి.కొండూరు తీసుకెళ్లారు. అది తెలిసిన వైకాపా వర్గీయులు... రోడ్డుపైకి చేరుకుని తెదేపా నేతల వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ దాడిలో ఓ తెదేపా నాయకుడి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసు రక్షణ మధ్య తెదేపా నేతల వాహనాలు జి.కొండూరు స్టేషను సమీపానికి చేరుకున్నాయి. వైకాపా నేత ఒకరు స్టేషను వద్దకు చేరుకుని స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహించిన తెదేపా కార్యకర్తలు, అతడి కారు అద్దాలను పగలగొట్టారు. దీంతో పోలీసులు వైకాపా నేతను అక్కడి నుంచి పంపించారు.

స్టేషను వద్ద ఉద్రిక్తత

ఉమాను స్టేషన్‌కు తీసుకొస్తున్నారన్న విషయం తెలుసుకున్న మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల వైకాపా, తెదేపా నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. స్టేషన్‌ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జీ చేశారు. రెండు పార్టీల కార్యకర్తలు రహదారిపై బైఠాయించి నినాదాలు చేస్తున్నారు. ఇంతలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌ పోలీసుస్టేషను వద్దకు బయలుదేరారు. ఆయన కారును ఇబ్రహీంపట్నం కూడలివద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపించారు.

కారులోనే ఉమా... అర్ధరాత్రి అరెస్టు

స్టేషన్‌ వద్ద భారీగా నాయకులు మోహరించడంతో దేవినేని ఉమాను తీసుకొస్తున్న పోలీసులు అక్కడికి అర కిలోమీటరు దూరంలోనే వాహనాన్ని నిలిపివేశారు.  రాత్రి 7 గంటల నుంచి ఉమా అక్కడే కారులో ఆగిపోయారు. తాను ఫిర్యాదు ఇస్తానని, తీసుకోవాలని కోరినా పోలీసులు స్పందించలేదు. ఫిర్యాదు తీసుకునే దాకా తాను కదిలేది లేదని ఆయన భీష్మించుకుని అందులోనే కూర్చున్నారు. కారును తొలగించి, ఉమాను తరలించేందుకు పోలీసులు పెద్ద క్రేన్‌ను కూడా తెప్పించారు. అది వీలు కాకపోవడంతో చివరకు కారు అద్దాన్ని తొలగించి, డోరు తెరిచారు. అనంతరం ఉమాను అదుపులోకి తీసుకుని తమ వాహనంలోకి ఎక్కించుకుని వేకువజామున 1.15 గంటలకు  తరలించారు. దీంతో దాదాపు ఆరు గంటల ఉత్కంఠకు తెరపడింది. పోలీసుల చర్యపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  జగన్‌ అరాచక పాలనకు ఇది నిదర్శనమన్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన వ్యక్తినే అరెస్టు చేయడం దారుణమన్నారు. అరెస్టు అనంతరం విజయవాడ ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కృష్ణా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌, ఏలూరు రేంజ్‌ డీఐజీ మోహనరావు మీడియాతో మాట్లాడుతూ.. ఉమా కుట్రపూరితంగా, ముందస్తు పథకంలో భాగంగా అలజడి సృష్టించేందుకే అక్కడికి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఏ సెక్షన్‌ కింద, ఎంతమంది మీద కేసు నమోదు చేసిందీ తర్వాత వెల్లడిస్తామన్నారు.

జగన్‌, సజ్జల కనుసన్నల్లోనే దాడి

నాపై దాడి జరిగిన చాలా సేపటి వరకు పోలీసులు రాలేదు. పెద్దసంఖ్యలో వైకాపా కార్యకర్తలు వచ్చి రాళ్లు రువ్వారు. ఇది పూర్తిగా సీఎం జగన్‌, సజ్జల నాయకత్వంలోనే జరిగింది. దీనికి ఇద్దరూ బాధ్యత వహించాలి. కొండపల్లి రిజర్వు అడవిలో రూ.లక్షల విలువైన గ్రావెల్‌ దోపిడీ జరిగింది. దానిపై ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు. ఈ ఘటన రాష్ట్రంలోని శాంతి, భద్రతల పరిస్థితికి అద్దం పడుతోంది. దీనికి డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలి.

- దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

అల్లర్లు సృష్టించే ప్రయత్నం

ప్రశాంతమైన మైలవరం నియోజకవర్గంలో ఘర్షణలు, అల్లర్లను ప్రేరేపించేందుకు తనపై, ప్రభుత్వంపై దేవినేని ఉమా విష ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ అన్నారు. రక్షిత ప్రాంతమైన కొండపల్లి కొండల్లోకి ఇప్పటికి 15సార్లు వెళ్లి అబద్ధాన్ని నిజం చేయాలని ఉమా చూస్తున్నారని విమర్శించారు. కొండపల్లి ప్రాంతంలో అనుమతులు ఇప్పించింది ఆయనే అని... అప్పుడు అవి రెవెన్యూ భూములని చెప్పి ప్రారంభోత్సవాలు చేసి, వాటిని అటవీ భూములని అంటున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండి:

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్​ బొమ్మై

Last Updated : Jul 28, 2021, 6:42 AM IST

ABOUT THE AUTHOR

...view details