ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆరంభంలోనే అదరగొడుతున్న ఎండలు.. విపత్తుల శాఖ హెచ్చరిక - Cumulonimbus

Summer temperature : వేసవి ఆరభంలోనే ఉష్ణోగ్రతలు అదరగొడుతున్నాయి. ప్రస్తుతం పగటి పూట సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం అవుతాయని హెచ్చరిస్తోంది. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని సూచిస్తోంది.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 1, 2023, 10:41 PM IST

Summer temperature : వేసవి ఆరభంలోనే ఉష్ణోగ్రతలు అదరగొడుతున్నాయి. ప్రస్తుతం పగటి పూట సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరువైనట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఏప్రిల్‌, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం అవుతాయని హెచ్చరిస్తోంది. వేడిగాలులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని సూచిస్తోంది.

వేసవి సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువవుతున్నట్టు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరివారంలో కర్నూలు జిల్లా కౌతాళంలో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం జిల్లా కొత్తవలసలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గడిచిన కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపం చూపుతుండడం వల్ల బయట అడుగు పెట్టేందుకు జనం జంకుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండలు తీవ్రంగా ఉంటాయని, దీంతోపాటు ఈసారి వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. భారత వాతావరణ సంస్థ సూచనల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేస్తుందని ఆ సంస్థ ఎండీ అంబేడ్కర్ వెల్లడించారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే జిల్లాలపై అధికారులు దృష్టి సారించాలని ఆ సంస్థ సూచించింది. వాస్తవానికి 2017 నుంచి 2021 వరకు వేసవి సీజన్లలో 46.7, 43.1, 46.4, 47.8, 45.9 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

గతేడాది నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంతటి తీవ్రమైన ఉష్ణోగ్రతల కారణంగా 2016లో 723 మంది, 2017లో 236 మంది, 2018లో 80 మంది, 2019లో 28 వడగాల్పుల కారణంగా మృతి చెందినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మరోవైపు ముందస్తు జాగ్రత్త చర్యలు, కొవిడ్ ఆంక్షల వల్ల 2020, 21, 22లో వడగాల్పుల మరణాలు దాదాపుగా నమోదు కాలేదు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ ఏమర్జన్సీ ఆపరేషన్ సెంటర్ ఎప్పటికప్పుడు జిల్లాల యంత్రాంగానికి ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తోంది.

వేసవిలో తీవ్రమైన ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల కారణంగా అకాల వర్షాలతో పిడుగులు పడే ప్రమాదం పొంచి ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆకస్మిక భారీవర్షాలు, పిడుగుపాట్ల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరోవైపు అత్యవసర సమయాల్లో విపత్తుల సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించాలని సూచనలు జారీ చేశారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details