Cyclone Effect: అసని తుపాను ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఉద్యాన పంటలు భారీగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా.. అరటి, బొప్పాయి, నిమ్మ, మొక్కజొన్న, పసుపు తదితర ఉద్యాన,వాణిజ్య పంటలపై తుపాను ప్రభావం చూపింది. మూడు రోజులు వీచిన గాలులకు అరటి, బొప్పాయి తోటలు చాలా చోట్ల నేలకొరిగాయి. తోట్లవల్లూరు, అవనిగడ్డ, ఘంటసాల, పామర్రు, ఉయ్యూరు, కంకిపాడు, మోపిదేవి మండలాల్లో పంటలకు అపార నష్టం వాటిల్లింది.
చాగంటిపాడు, భధ్రరాజుపాలెం, వల్లూరివారిపాలెం గ్రామాల్లో అరటి రైతులు దెబ్బతిన్న పంటను చూసి ఆవేదన చెందుతున్నారు. పడిపోయిన తోటలు శుభ్రం చేసేందుకే ఎకరాకు 10 నుంచి 20 వేల రూపాయలు అదనంగా ఖర్చవుతాయని వాపోతున్నారు.