ఏపీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2016 జనవరి 1 నుంచి విధి నిర్వహణలో చనిపోయిన కార్మికుల వివరాలు, కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యులు పెట్టుకున్న దరఖాస్తులు, ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపాలని అధికారులను ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఆర్ఎంలకు ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 16లోగా కారుణ్య నియామక దరఖాస్తుల వివరాలు కలెక్టర్లకు పంపాలని ఆదేశాల్లో తెలిపారు. 2015 డిసెంబర్ 31 వరకు చనిపోయిన కుటుంబాలకు ఆర్టీసీ కారుణ్య నియాకాలను గతేడాది అక్టోబర్ లో చేపట్టింది. అర్హత కల్గిన కుటుంబ సభ్యులకు సంస్థలో ఉద్యోగాలిచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. దీంతో కారుణ్య నియామకాలు ప్రభుత్వం చేపట్టాల్సి ఉంటుంది. ఇకపై ఆయా జిల్లాల కలెక్టర్లు ఈ ప్రక్రియను కొనసాగించనున్నారు.