ఉద్యోగుల మలి దశ ఉద్యమం.. ఈ నెల 29 వరకు ఆందోళనలు AP JAC Amaravati Employees Movement Activity : ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం రెండో దశ ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 5వ తేదీ నుంచి 29 వరకు రెండో దశ ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలోని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టనున్నట్లు తెలిపింది. 8 తేదీన నల్ల కండువాలు ధరించి ముఖ్యమైన కూడళ్లలో ఉద్యోగుల డిమాండ్లతో కూడిన పోస్టర్లు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. 10 తేదీన నల్ల మాస్కులు ధరించి.. స్పందన కార్యక్రమంలో 26 జిల్లాల్లో కలెక్టర్లకు ఉద్యోగుల డిమాండ్ల పై మెమోరాండం ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఈ నెల 11 న ఒక్క రోజు సెల్ ఫోన్లలో ప్రభుత్వ యాప్ల వినియోగాన్ని నిలుపుదల చేయాలని నిర్ణయించింది. 12వ తేదీన 26 జిల్లాల ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వారి సమస్యలపై ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 15న.. మరణించిన సీపీఎస్, పదవీ విరమణ చెందిన ఉద్యోగుల కుటుంబాల ఇళ్లను సందర్శించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది.
20న బ్యాంకుల సందర్శన... ఈ నెల 20వ తేదీన ప్రతి నెలా జీతాల ఆలస్యానికి నిరసనగా బ్యాంకర్లను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు పేర్కొంది. ఈఎంఐ చెల్లింపుల పై ఒత్తిడి చేయవద్దని, ఫెనాల్టీలు వేయవద్దని కోరుతూ ప్రధాన బ్యాంకులను సందర్శించనున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 25న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ధర్నా చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 27న రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లను సందర్శించి ప్రతినెలా ఆలస్యంగా పెన్షన్ వస్తున్నందున వారి సమస్యలపై పరామర్శ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపింది. 29వ తేదీన అన్ని కలెక్టరేట్ల వద్ద గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యల పై ధర్నా చేయనున్నట్లు వెల్లడించింది.
ఆందోళన కొనసాగుతుంది.. ప్రభుత్వం తాము ఇచ్చిన రెండో దశ ఉద్యమ కార్యాచరణకు స్పందించి డిమాండ్లు తీర్చక పోతే మూడో దశ ఆందోళనకు వెళ్తామని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. చెబుతున్న మాటలకు చేస్తున్న వ్యవహారాల కారణం గా ఉద్యోగుల్లో ప్రభుత్వం అంటే అభద్రతా భావం ఉందని, అందుకే లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరుతున్నామని బొప్పరాజు వెల్లడించారు. ఇతర ఉద్యోగ సంఘాలు తమ పోరాటానికి కలిసి రావాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ల పై స్పష్టత ఇవ్వకపోవడంతో తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించామని బొప్పరాజు తెలిపారు.
'చలో విజయవాడ'కు సిద్ధం..మే నెల లో ప్రాంతీయ సమావేశాలు విశాఖ, ఏలూరు, నెల్లూరు, అనంతపురం నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించక పోతే చలో విజయవాడ తరహా కార్యక్రమం పెడతామన్నారు. ప్రతీ నెలా ఉద్యోగులకు ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని బొప్పరాజు నిలదీశారు. బ్యాంకులకు కట్టాల్సిన ఈఎంఐ, పాల వాళ్లకు, ఇతర ఖర్చులు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం కోరితే అందుకు అనుగుణంగా బ్యాంకులను అదేశిస్తుందా అని ధ్వజమెత్తారు. పేస్కైళ్ల విషయంలో ప్రభుత్వం ఉద్యోగులను ఎందుకు మోసం చేస్తోందని ప్రశ్నించారు. పే స్కేల్లో జరిగిన మోసం తో ప్రతీ ఉద్యోగికి అన్యాయం జరుగుతోందని, జయప్రకాశ్ నారాయణ సీపీఎస్ వల్ల ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పడం శోచనీయమన్నారు.
12వ పీఆర్సీ వేయాలి.. వారంలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పారని, ఆ వారం ఎప్పుడు వస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారని బొప్పరాజు ఎద్దేవా చేశారు. డీఏ అరియర్ల గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పీఆర్సీ అరియర్ నుంచి డీఏ అరియర్లను వేరు చేయాలని కోరామని, 12 పీఆర్సీ కమిషనర్ నియామకం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కొత్త డీఏ ల గురించి ఆర్థిక శాఖ మాటే ఎత్తటం లేదని వాపోయారు. గ్రామ వార్డు సచివాలయాల్లో తీవ్రమైన పనిభారం ఉంటోందని బొప్పరాజు తెలిపారు. మహిళా రక్షణ కార్యదర్శులను హఠాత్తుగా పోలీసులుగా మార్చేసి బలవంతం చేస్తున్నారని, అసలు వారికి శిక్షణ లేకుండా పోలీసులని ఎలా పిలుస్తారని మండిపడ్డారు. వాలంటీర్లు, సలహాదారుల జీతాలను కూడా కలిపేసి 74 వేల కోట్లు అని చెబుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8.5లక్షల మంది ఉద్యోగులు, 3.5 లక్షల మంది పెన్షన్లు తీసుకునే వారితో కలిపి 12 లక్షల మందికి ప్రభుత్వం చెల్లింపులు చేస్తోందని, ప్రభుత్వం 20 వేల కోట్ల అదనపు ఖర్చును కూడా జీతాలతో కలిపేసి చెబుతోందని దుయ్యబట్టారు.
నెల రోజులుగా ఉద్యమం చేస్తున్నా ప్రభుత్వం నుంచి హామీ లభించలేదు. మా సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. వేతనాలు, పీఆర్సీ, ఏరియర్స్, డీఏలపై ఎలాంటి నిర్ణయాలను ప్రకటించలేదు. ఈ నేపథ్యాన ఉద్యమాన్ని కొనసాగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. ఈ నెల 8న పోస్టర్ల విడుదలతో మొదలై ధర్నాలు, పరామర్శలతో కొనసాగిస్తాం. ఈ ఉద్యమంలో ప్రతి ఉద్యోగి తప్పకుండా పాల్గొనాలని కోరుతున్నాం. ప్రభుత్వం దిగిరాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఒకవేళ చర్చలకు ఆహ్వానిస్తే వెళ్లి మా సమస్యలను ప్రభుత్వం ముందుంచుతాం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగుల సంఘం, అధ్యక్షుడు
ఇవీ చదవండి :