లాక్‌డౌన్ నిబంధనలు మరికొన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు, బఫర్ జోన్లు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతిచ్చింది. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓ క్రమపద్ధతిలో దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించింది. తెరిచిన రెండు దుకాణాల మధ్య మరొకటి మూసివేసి ఉంటాల్సిందిగా సూచించింది. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్లు, అధికారులు రోస్టర్ విధానం అనుసరించాలని ప్రభుత్వం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని రకాల మాల్స్, దుకాణాలు తెరుచుకోవచ్చన్న ప్రభుత్వం... పట్టణ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, మార్కెట్ కాంప్లెక్సులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. పట్టణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లోని దుకాణాలు తెరుచుకునేందుకు అనుమతించింది. వీటితో పాటు నిర్మాణ రంగ కార్యక్రమాలు, విత్తనాలు, పంపుసెట్ల విక్రయాల దుకాణాలను అనుమతించాలని సూచించింది. ఈ దుకాణాలన్నీకనీసం 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.