తన రక్తమాంసాలు పంచి... బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రతీతల్లి మరో జన్మఎత్తుతుంది. ఆ బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో తన ఒడి చేరినప్పుడు అన్ని బాధలూ మరిచిపోయి ఆనందంతో పులకిస్తుంది. కానీ... బిడ్డ ఆరోగ్యం తల్లి ఆహారంపైనా... ఆమెకు అందే వైద్యం... ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకించి నిరుపేద మహిళలు గర్భం దాల్చినపుడు తొమ్మిది నెలలు సరైన పౌష్టికారం అందక రక్తహీనత బారినపడి... ప్రసవ సమయంలో ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్తుంటారు.
ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం గురించి సందేహాలు... ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆర్థిక స్థోమత లేకపోవడం... ఇళ్ల వద్దే కాన్పు చేయించుకుని ప్రాణాలమీదకు తెచ్చుకున్నవారెందరో. ఇదంతా గతం.. ఇప్పుడు నిరుపేద మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి మొదలు... ఆసుపత్రిలో సుఖప్రసవం చేయించుకుని తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరే వరకు చంద్రబాబు ప్రభుత్వమే భరోసా కల్పిస్తోంది. పలు పథకాల ద్వారా అనేక ప్రోత్సాహకాలు లభిస్తుండటంతో... గర్భిణులు సర్కారీ దవాఖానాల్లో సుఖప్రసవాలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు.