ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తొమ్మిదో రోజుకు చేరిన అంగన్వాడీల నిరసన - మద్దతుగా నిలిచిన చిన్నారుల తల్లిదండ్రులు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2023, 3:24 PM IST

Anganwadi Protest of 9th Day: డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్మికుల చేస్తున్న ఆందోళనలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. గత ఎనిమిది రోజులుగా అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్లు నెరవేర్చమని వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతున్నారు. అయినా ప్రభుత్వం దిగిరాకపోవటంతో ఈరోజు అంగన్వాడీలు, వర్కర్లతో పాటూ అంగన్వాడీలో చదువుతున్న చిన్నారుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేంగా నినాదాలు చేస్తున్నారు.

Anganwadi_Protest_of_9th_Day
Anganwadi_Protest_of_9th_Day

Anganwadi Protest of 9th Day: కనీస వేతనం, గ్రాట్యూటీ, ఫించన్, మినీ అంగన్వాడీలను మెయిన్‌గా గుర్తించాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనలు తొమ్మిదొ రోజుకు చేరుకున్నాయి. వివిధ రకాలుగా, వినూత్న నిరసనలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తూ నామమాత్రపు చర్చలతో కాలయాపన చేస్తుందని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం డిమాండ్​లను పరిష్కరించకపోతేనిరసనలు మరింత ఉద్ధృతం చేస్తామని అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Anganwadi Protest in Vijayawada: విజయవాడ ధర్నాచౌక్‌లో చేపట్టిన ధర్నాలో అంగన్వాడీ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. కనీస వేతనాలు ఇవ్వమని అడుగుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంగన్‌వాడీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించడం చేతకాని ప్రభుత్వం మంత్రుల చేత అంగన్వాడీల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుందని మండిపడుతున్నారు. అంగన్‌వాడీలను ప్రభుత్వం తేలికగా తీసుకోవద్దని తాము తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయేపరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.

"అంగన్వాడీల శ్రమను ప్రభుత్వం గుర్తించి, వేతనం పెంచాలి. ప్రభుత్వం చర్చలకు పిలిచి మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలి. కనీస వేతనం 26000 చేసి, గ్రాట్యూటీ సదుపాయం పెంచాలి. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తాం." - అంగన్వాడీ కార్యకర్త

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించమని సమ్మె చేస్తుంటే అంగన్వాడీ కేంద్రాలను బలవంతంగా తెరిపించడం ఏంటని కార్మికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీలు తొమ్మిది రోజులుగా ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మ శ్రీ, ఏపీ మహిళా సమాఖ్య ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని మండిపడ్డారు. అంగన్వాడీ కార్మికులు చేస్తున్న ఆందోళనకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.

Anganwadi Protest in Anantapur: డిమాండ్ల సాధన కోసం తొమ్మిదిరోజులుగా అంగన్వాడీలుసమ్మె చేస్తున్నా సీఎం జగన్ మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారని అంగన్వాడీల చిన్నారుల తల్లులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా టవర్ క్లాక్‌ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు అంగన్వాడీలు, వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేంగా నినాదాలు చేశారు. మా టీచర్ల సమస్యలు పరిష్కరించండి అంటూ చిన్నారులు పలకలపై రాసి ప్రదర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కనీస వేతనం, గ్రాట్యుటీ, ఫించను అమలు చేసి తదితర సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు కోరారు.

ABOUT THE AUTHOR

...view details