కుటుంబ కలహాల నేపథ్యంలోనే పమిడిముక్కల మండలం, అగినపర్రుకు చెందిన మటన్ వ్యాపారి దేవరకొండ నాంచారయ్య దారుణ హత్య జరిగిందని కృష్ణా జిల్లా అవనిగడ్డ డీఎస్పీ మహబూబ్ భాషా తెలిపారు. అగినపర్రుకు చెందిన మటన్ వ్యాపారులు నాంచారయ్య, గరికే ఏడు కొండలుకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయని.. నిందితుని కుమార్తెకు నాంచారయ్య సోదరుని కుమారుడితో వివాహం చేద్దామని నిర్ణయించుకున్న తర్వాత వివాహాన్ని రద్దు చేసుకుందామని ఆలోచించుకున్నారు. నాంచారయ్యతో ఇబ్బందులు పోవాలంటే అతనిని అడ్డుతొలగిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావించిన ఏడుకొండలు.. అతని కుటుంబసభ్యులతో కలిసి హత్యకు పథకరచన చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. 14న ఏడుకొండలు అతని కుటుంబ సభ్యులు నాంచారయ్యను వారి మోటార్ సైకిల్ పై ఎక్కించుకుని అగినపర్రు దాటిన తర్వాత మందు తాగించి నిమ్మగడ్డ సమీపంలో హతమార్చి కాల్వలోకి తోసేసి వెళ్లిపోయినట్లు వివరించారు.
16న నిమ్మగడ్డ వీఆర్ఓ వద్ద ఏడుకొండలు లొంగిపోయాడని తెలిపారు. మృతదేహాన్ని గుర్తించిన అనంతరం హత్య కేసుగా ఆల్టర్ చేసి నిందితుడు ఏడుకొండలును అరెస్టు చేశామన్నారు. హత్యలో కుటుంబసభ్యుల పాత్రపై దర్యాప్తు చేసామనీ.. వారిని త్వరలో అరెస్టు చేయనున్నట్లు వెల్లడించారు. మేజిస్ట్రేట్ ఎదుట ఈరోజు హాజరు పరచనున్నట్లు తెలిపారు.
అసలేం జరిగిందంటే..
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం నిమ్మగడ్డ - వెలివోలు గ్రామాల మధ్యలో కృష్ణానది ఎడమ కరకట్ట కేఈబీ కాలువలో రెండు మూటలలో మృతదేహం కలకలం రేపింది. కాలువలో మూటలున్నాయని చల్లపల్లి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. మూటలను విప్పి చూడగా అందులో మృతదేహం రెండు భాగాలుగా కనిపించిందని పోలీసులు తెలిపారు. కాగా అంతకుముందు అగినపర్రు గ్రామానికి చెందిన దేవరకొండ నాంచారయ్య అనే వ్యక్తిని చంపి ఆ కాలువలో పడవేసినట్లు కూచిపూడి పోలీస్ స్టేషన్లో గరికే ఏడుకొండలు అనే వ్యక్తి లొంగిపోయాడు. పోలీసులు ఆ కోణంలో విచారిస్తూ నాంచారయ్య కుటుంబ సభ్యులను నిమ్మగడ్డ లాకుల వద్దకు తీసుకొచ్చారు. ఆ శవం నాంచారయ్యదేనని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఏడుకొండలు కుమారుడు నాగరాజు ఈ హత్యలో పాలుపంచుకున్నాడని పోలీసులు తెలిపారు.