ఆదిత్య హత్యకు.. ఆ విషయమే కారణమా!? మూడో తరగతి విద్యార్థి హత్య అందరినీ కలచి వేస్తోంది. అభంశుభం తెలియని ఆ చిన్నారి మృతికి కారకులెవరనే... ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు, పోలీసుల కథనం ప్రకారం... కృష్ణా జిల్లా చల్లపల్లిలోని వెనుకబడిన తరగతుల వసతి గృహంలో దాసరి ఆదిత్య మూడో తరగతి చదువుతున్నాడు. ఈక్రమంలో ఇవాళ ఉదయం హాస్టల్లోనే స్నానాల గదిలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు.
ఆదిత్య.. అందరికంటే చిన్నోడు
చల్లపల్లి నారాయణరావు నగర్‌కు చెందిన రవీంద్ర, రాజ్యలక్ష్మిల గారాల కొడుకు ఆదిత్య. నలుగురు సంతానంలో ఆదిత్య చిన్నవాడు. అన్నయ్య అశోక్ ఇదే వసతిగృహంలో ఏడో తరగతి చదువుతున్నాడు. ఓ అక్క తొమ్మిదో తరగతి, మరో అక్క మొవ్వ వసతిగృహంలో నాలుగో తరగతి చదువుతోంది. ఆదిత్య అందరికంటే.. చిన్నవాడు కావడంతో అందరికీ అతనంటే ఎంతో గారాబం. అటువంటి చిన్నారి మృతితో ఆ కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగిపోయింది.
రంగంలోకి ప్రత్యేక బలగాలు...
హత్య కేసులు ఛేదించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలతోపాటు పోలీసులు జాగిలాలు, క్లూస్ బృందాలను రంగంలోకి దించారు. హత్య ఎవరు చేశారనే విషయంలో ఇంతవరకు ఓ ఖచ్చితమైన నిర్దారణకు రాకపోయినా... కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
తెలిసిన వారి పనేనా..!?
ఆదిత్య మెడపై బలమైన గాయాలు ఉండడం... వసతిగృహంలోకి వచ్చిమరీ హత్యకు పాల్పడడం.. అన్నీ చూస్తే ఇది బంధువుల పనేనేమో.. అనే సందేహాన్ని పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన కుటుంబ తగాదాల్లో తమను మరిది బెదిరించాడని... మృతుడి తల్లి రాజలక్ష్మి సందేహం వెలిబుచ్చారు. దీంతో పోలీసులు ఈ దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అన్నదమ్ముల హత్యకు ప్రణాళిక వేశారా!?
ఆదిత్యతోపాటు అన్నయ్య అశోక్ కూడా ఇదే పాఠశాలలో చదువుతుండడంతో ఇద్దరి హత్యకు ప్రణాళిక జరిగిందా.. అనే సందేహం కలుగుతోంది. తొలుత అశోక్ రూమ్‌కి వెళ్లిన నిందితుడు... అతనిని బయటికి రావాల్సిందిగా కోరినట్టు సమాచారం. అశోక్ బయటికి రాకపోవడంతో ఆదిత్యను తీసుకెళ్లి హత్య చేసినట్టు తెలుస్తోంది! ఒకవేళ అన్నయ్య వచ్చిఉంటే.. ఇద్దరినీ అంతమొందించేవాడనే అనుమానాన్ని కుటుంబ సభ్యులు, పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.
ఆదిత్య హత్య హాస్టల్లోని విద్యార్థులను భయాందోళనకు గురిచేసింది. తోటి విద్యార్థులతోపాటు బంధువులు, గ్రామస్తులు అక్కడికి రావడంతో.. వసతిగృహ ప్రాంగణం కన్నీటి సంద్రమైంది.
ఇదీ చదవండీ...ఆ నలుగురి కారణంగా.. చనిపోవాలనుకుంటున్నా!