మెడికల్ సీట్ ఇప్పిస్తామన్నారు... రూ. 15 లక్షలు కాజేశారు
"కొంత సొమ్మును చెల్లించండి చాలు... మీ కుమారుడికి ప్రభుత్వ కళాశాలలో మెడికల్ సీటు ఇప్పిస్తాం" అంటూ ఓ విద్యార్థి తండ్రిని అపరిచిత వ్యక్తులు నమ్మించారు. విడతలవారీగా దాదాపు రూ.15 లక్షల వరకు నగదును ఖాతాలో వేయించుకున్నారు. చివరకి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి సొమ్ము తీసుకుని ఉడాయించారు.
మెడికల్ సీటు ఇప్పిస్తామంటూ దాదాపు 15 లక్షలు మేర మోసం చేసిన ఘటనపై మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మచిలీపట్నం మాచవరానికి చెందిన నాగమోహన్ రావు ఉపాధ్యాయుడు. ఇతని కుమారుడు యదువంశి ఎంబీబీఎస్ చేరాలనే ఉద్దేశంతో నీట్ పరీక్షకు హాజరయ్యాడు. కానీ అతను ఆ పరీక్షలో అర్హత సాధించలేదు. అతనికి ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. కొంత మొత్తం చెల్లిస్తే ప్రభుత్వ కళాశాలలో సీటు కేటాయిస్తామనేది ఆ మెసేజ్ సారాంశం. దీనిని నమ్మిన నాగమోహన్ రావు... తన కుమారుడికి ఎలాగైనా సీటు రావాలనే కోరికతో విడతల వారిగా దాదాపు 15 లక్షల రూపాయిలను అపరిచిత వ్యక్తి సూచించిన ఖాతాకు బదిలీ చేశాడు. కలకత్తాలోని నేషనల్ మెడికల్ కాలేజీలో యదువంశీకి సీటు వచ్చిందంటూ నాగ మోహన్‌రావును నమ్మించి కొన్ని నకిలీ పత్రాలను పంపించారు. తీరా వీటిని తీసుకుని వారు చెప్పిన కళాశాలకు వెళ్లగా మోసపోయినట్లు గ్రహించారు. అపరిచిత వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.