Wife personal photos on WhatsApp groups: మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా.. కామాంధులకు అవి చుట్టాలుగా మారిపోతున్నాయి. తప్పు చేస్తున్నామనే భయం లేకపోవడమో.. లేదా తప్పు చేస్తే పడే శిక్షను గురించి అవగాహన లేకపోవడమో.. నిత్యం ఎక్కడో ఒకచోట మైనర్లపై అత్యాచారాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఘటనలు జరిగినప్పుడు హడావిడి చేసే ప్రభుత్వం.. కొంత కాలం తరువాత షరామామూలే అన్న చందగా వ్యవహరిస్తుందనే విమర్శలు సైతం వస్తున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో నెలలో రెండో ఘటన చోటు చేసుకోవడం సంచలనం రేపుతోంది.
గత కొంత కాలంగా చిన్న పిల్లలను (మైనర్), యువతులను వేధిస్తూ, వారిపై అత్యాచారాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో జరుగుతున్న జాప్యం.. దోషులు నిర్దోషులుగా బయటపడేందుకు అధికార రాజకీయ పక్షాల సహకారం కారణంగా నేరాలకు పాల్పడే యువకుల్లో భయం.. బాధ అనేది కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ప్రకారం సైతం.. తొందరగా శిక్షలు పడే అవకాశాలు కనిపించకపోవడం లేదు. కట్టుకున్న భర్తే తన భార్యతో ఉన్న ఫోటోలు స్నేహితులకు షేర్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలో గత నెల మొదటి వారంలో మైనర్ బాలికను ఐదుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన పది రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఆ ఘటన మరవక ముందే ఓ యువకుడు మైనర్ బాలికను వివాహం చేసుకొని మొదటి రాత్రి బాలికతో ఏకాంతంగా ఉన్న చిత్రాలను తీసి వాట్సాప్ గ్రూప్లో పెట్టిన ఘటన ఆలస్యంగా బయటపడింది.
కాట్రేనికోన మండలం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని ఓ మత్స్యకార గ్రామంలో గత నెల 8వ తేదీన మైనర్ బాలికతో యువకుడికి పెద్దల వివాహం జరిపించారు. గ్రామ కట్టుబాట్ల కారణంగా ఆ విషయం బయటకు తెలియకుండా వివాహం చేశారు. ఆ యువకుడు మాత్రం అత్యుత్సాహంతో మొదటి రాత్రి.. బాలికతో ఏకాంతంగా ఉన్న చిత్రాలను తీసి.. తన మిత్రులకు వాట్సాప్ గ్రూపులో పంపించాడు. అవి కాస్త వైరల్ అయ్యాయి. విషయం బాలిక తల్లిదండ్రులకూ తెలియడంతో 20వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేయగా.. సీఐ జానకిరామ్ విచారణ చేపట్టి గత నెల 28వ తేదీన నిందితుడు మల్లాడి వీరబాబును అదపులోకి తీసుకున్నారు.. ముమ్మిడివరం సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.
ఇవీ చదవండి: