Kodi Katti Case Accused Mother Avedana: వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై 2018 విశాఖ విమానాశ్రయంలో కోడికత్తితో దాడి చేసిన చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాసరావు నాలుగున్నర సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరం కారాగారంలో మగ్గుతున్న విషయం కూడా తెలిసిందే. తనను విడుదల చేసి.. జైలు నుంచి విముక్తి కలిగించాలని పలుమార్లు శ్రీనివాసరావు వేడుకున్న విషయం విదితమే. అలాగే అతని తల్లి కూడా పలుమార్లు తన కొడుకును విడుదల చేయాలని లేఖలు కూడా రాశారు. తాజాగా కోడికత్తి కేసును విశాఖ ఎన్‌ఐఏ కోర్టుకు బదిలీ చేసిన నేపథ్యంలో ఆమె మరోసారి కన్నీటి పర్యంతం అయ్యారు.
హత్యలు చేసిన వాళ్లు బయట తిరిగేస్తున్నారని.. రోడ్డు మీద చంపేసి మూట కట్టేసి పడేసిన వాళ్లకు బెయిల్ ఇచ్చేశారని.. కానీ తన కొడుకు ఏ తప్పు చేయకపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా జైల్లో పెట్టారని కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకు చాలా మంచోడని.. ఎందుకు అలా జరిగిందంటే తామేం చెప్పాలన్నారు. తమకు జగన్ పార్టీ అన్నా.. జగన్ అన్నా మహాభిమానం అన్నారు. తాము ఆయననే నమ్ముకున్నట్లు తెలిపారు. కానీ తప్పు తమ మీదకు ఎందుకు తోశారో తెలియదు అని వ్యాఖ్యానించారు. అందరూ తమకు బుద్ధి లేదని అంటున్నా.. తాము మాత్రం ఆయన్నే(సీఎం జగన్) నమ్మామన్నారు.
"హత్యలు చేసిన వాళ్లు బయట తిరుగుతున్నారు. రోడ్డు మీద చంపేసి మూట కట్టేసి పడేసిన వాళ్లకు బెయిల్ ఇచ్చేశారు. నా కొడుకు ఏ తప్పు చేయపోయినా నాలుగున్నర సంవత్సరాలుగా జైల్లో పెట్టారు. నా కొడుకు చాలా మంచోడు.. ఎందుకు అలా జరిగిందంటే మేమేం చెప్పాలి.. మేం జగన్ పార్టీ.. జగన్ అంటే మాకు మహా అభిమానం. మేము ఆయననే నమ్ముకున్నాం. అందరూ బుద్ధి లేదని అంటున్నా.. మేం ఆయన్నే నమ్మాము. నా కొడుకు బయటకు వస్తాడో రాడో దేవుడి నిర్ణయం.. నా కొడుకు కర్మ అలా అయిపోయింది."సావిత్రి, కోడికత్తి కేసు నిందితుడి తల్లి
తమ కొడుకు బయటకు వస్తాడో రాడో దేవుడి చిత్తం అన్న సావిత్రి.. తమ కొడుకు కర్మ అలా అయిపోయింది అని వాపోయారు. ఎన్‌ఐఏ వాళ్లు తమ కొడుకుది ఏమీ తప్పు లేదని చెప్పారని.. తమ అబ్బాయి ఇంటికి వచ్చేస్తాడనే నమ్ముతున్నామన్నారు. చివరి రోజుల్లో తమ కొడుకు తమ దగ్గర ఉండాలని కోరుకుంటున్నట్లు అని కన్నీటి పర్యంతమయ్యారు. గోదావరి వరదలకు ముమ్మిడివరం మండలం ఠాణేలంకలో మిర్చి, బెండ తోటలు మునిగి నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీనివాసరావును విడుదల చేయాలని కోరుతూ గతంలో ఆమె రాష్ట్రపతికి లేఖ రాశారు. అనంతరం సీఎం జగన్‌ను కలవడానికి తాడేపల్లి వెళ్లినా ఫలితం లేకపోయింది.
Kodi Katthi Case: కోడి కత్తి కేసు.. జగన్ అభియోగాలన్నీ కట్టు కథలే.. జాతీయ దర్యాప్తు సంస్థ
‘హంతకులు బయట తిరుగుతున్నారు.. నా కొడుకు జైల్లో మగ్గుతున్నాడు’