Officials Alerted in the Wake of Pawan Kalyan Visit: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పవన్ పరామర్శించనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ధాన్యం కొనడానికి ఉరుకులు పరుగులు పెట్టారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల పాలెం గ్రామానికి విచ్చేయనున్నారు. రైతులతో మాట్లాడి.. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు గాను జనసైనికులు రాజుల పాలెం గ్రామాన్ని ఎంపిక చేశారు.
ఈ విషయం కాస్తా అధికారులకు తెలిసింది. దీంతో హుటాహుటిన రాజుల పాలెం గ్రామానికి చేరుకుని ధాన్యం కొంటామని హంగామా చేశారు. పవన్ కల్యాణ్ వస్తున్నారని.. మీరు ఇప్పుడు హడావుడిగా ధాన్యం కొనడం ఏమిటని జనసైనికులు అధికారులను నిలదీశారు. మధ్యాహ్నం వరకూ ధాన్యంలో తేమ శాతం ఉందని చెప్పిన అధికారులు.. పవన్ కల్యాణ్ వస్తున్నాడని.. ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని జనసైనికులు అంటున్నారు.
అధికారులు ఏమన్నారంటే: కొనుగోలు చేసిన ధాన్యానికి మిల్లర్లు ఎలాంటి కోత విధించినా తాము ఊరుకోమని.. రైతులకు నష్టం జరిగితే తిరిగి మిల్లర్ల నుంచి ఇప్పిస్తామని తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్పష్టం చేశారు. రైతులు మిల్లర్లకు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని.. ఎవరైనా సరే అలా అడిగితే తమకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు.