Two Labourers Died During The Church Wall Collapse : కాకినాడ జిల్లా సామర్లకోట బలుసుల పేటలో చర్చి పునర్నిర్మాణ పనుల్లో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో కూలి తీవ్రంగా గాయపడ్డారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి పునర్నిర్మాణంలో భాగంగా చర్చి ముందున్న గోడ కూల్చుతుండగా షెడ్ భీం ఒక్కసారిగా కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావు, యడగల అబ్రహంలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వారికి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
పరామర్శించిన రాజకీయ నాయకులు : ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో బలుసుల పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను పెద్దాపురం ఎమ్మెల్యే చిన రాజప్ప, వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు, జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు పరామర్శించారు.
పాము కాటుతో మూడేళ్ల బాలుడు మృతి : శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. నల్ల చెరువుకు చెందిన సుమిత్ర ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. ఆమె రెండో కుమారుడిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కుళాయి వద్దకు వెళ్లిన బాలుడి చేతిపై పాము కాటు వేసింది. చేయివాచి రక్తస్రావం కావటంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. వైద్యులు సాధారణ చికిత్స చేశారు. తర్వాత కొంత సేపటికే నురగలు కక్కుతూ బాలుడు మృతి చెందాడు.