వైకాపా ప్రభుత్వంలో ప్రజలపై మోపుతున్న ధరాభారంపై పోరాటాన్ని కొనసాగిస్తున్న చంద్రబాబు.. కాకినాడ జిల్లా తాళ్లరేవులో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ర్యాలీగా గ్రామానికి వచ్చిన తెలుగుదేశం అధినేతకు.. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం నిత్యావసరాల ధరల పెంపు, పన్నుల వాతలపై ప్రజల స్పందనను తెలుసుకున్నారు. అన్ని ప్రభుత్వాల లాగానే తాము పన్నులు విధిస్తున్నామని చెబుతున్న వైకాపా తీరుపై మండిపడ్డ చంద్రబాబు.. ప్రజలిచ్చిన విద్యుత్ బిల్లులను పోల్చి చూపెడుతూ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పదోతరగతి ప్రశ్నపత్రాల లీకేజీ తెలుగుదేశం నేతల పనేనన్న సీఎం జగన్ వ్యాఖ్యలపైనా విమర్శలు సంధించారు. యువతకు లక్షలాది ఉద్యోగాలు కల్పించామన్న వైకాపా సర్కార్ తీరును చలోక్తులు విసురుతూ ఎద్దేవా చేశారు. కాకానాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి బియ్యం అక్రమాల్లో ఆరితేరారన్న చంద్రబాబు.. ఆయన జగన్ బినామీ అని ఆరోపించారు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డిని.. చంద్రబాబు పరామర్శించారు.
‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ :రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని.. ప్రజాసమస్యలపై పోరాడుతామని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగుతున్నాయన్నారు. కాకినాడలో తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల తెదేపా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని ఆయన పిలుపునిచ్చారు.
సజ్జల స్టేట్‌మెంట్లను హోంమంత్రి చదువుతున్నారు:‘‘నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు. సజ్జల రాసిన స్టేట్‌మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి రూ.కోట్లు సంపాదించే అవకాశం కల్పిస్తే.. జగన్ వాలంటీరు ఉద్యోగాలు ఇచ్చి రూ.5వేలు పడేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్ అంధకారం చేస్తున్నారు. కరెంట్ బిల్లులను 40 శాతం పెంచారు. కరెంట్ రాదు కానీ.. బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. జంగారెడ్డిగూడెం సారా మరణాలు సహజ మరణాలంటూ కొట్టిపారేశారు.