ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Canal shutters destroyed: గ్రామాల మధ్య సాగు నీరు చిచ్చు.. ఏలేరు కాలువపై షట్టర్లు తొలగింపు - Kakinada news

Gokiwada canal shutters destroyed: సాగు నీటి కష్టాలు.. గ్రామాల మధ్య చిచ్చురేపాయి. పంట కాల్వల్లో అడ్డుకట్ట నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే తెరవెనుక ఊతమిచ్చి ఇప్పుడు ససేమిరా అనడంతో.. ఉద్రిక్తత ఏర్పడింది. సాగుకు నీరు చాలడం లేదని ఎగువ గ్రామ రైతులంటుంటే.. కనీసం నారు పోయడానికి కూడా నీరు అందకుండా చేశారని దిగువ గ్రామాల రైతులు వాపోతున్నారు. కాకినాడ జిల్లా గోకివాడలో ఏలేరు పుట్టకొండయ్య కాలువపై అనాధికార లాకుల్ని అధికారులు, పోలీసుల సమక్షంలో తొలిగించారు. ఆందోళనలో పాల్గొని గోకివాడ రైతు మృతి చెందారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 9, 2023, 10:58 AM IST

గ్రామాల మధ్య చిచ్చురేపిన సాగు నీరు.. ఏలేరు కాలువపై షట్టర్లు తొలగింపు

Gokiwada canal shutters destroyed: సాగునీటి కష్టాలు గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. నీరు తమకు చాలడంలేదని ఓ గ్రామ రైతులంటే.. కనీసం నారు పోయడానికీ నీరు అందకుండా అడ్డుకట్టలు వేయడం ఏమిటని దిగువ గ్రామాల వారు అంటున్నారు. ఏడాదిగా కొనసాగుతున్న ఈ పరిస్థితి శనివారం ఉద్రిక్తతకు దారితీసింది. ప్రతిఘటనలు.. అరెస్టులు.. అనధికారిక కట్టడాల కూల్చివేతల వరకు వ్యవహారం వెళ్లింది.

కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని గోకివాడలో ఏలేరు పుట్టకొండయ్య కాలువపై లాకులవద్ద అనాధికారికంగా నిర్మించిన నిర్మాణం, షట్టర్ల తొలగింపులో ఉద్రిక్తత నెలకొంది. ఏలేరు కిర్లంపూడి సెక్షన్ పరిధిలోని ముక్కొల్లు కాలువ ద్వారా గోకివాడలోని పుట్ట కొండయ్య కాలువకు సాగు నీరు సరఫరా అవుతోంది. ఈ కాలువ ద్వారా గోకివాడ, రాపర్తి, జములపల్లి, పి.రాయవరం, భోగాపురం, బి ప్రత్తిపాడు గ్రామాలకు ఓపెన్ ఛానల్ నుంచి నీటిని అందిస్తారు. ఇది బ్రిటీష్ కాలంలో నిర్మించిన నిర్మాణం.

ఏడాది క్రితం గోకివాడలోని అక్కినీడువారి చెరువును నీటితో నింపి సాగునీటికి ఇబ్బందులు లేకుండా చేసుకునేలా సొంత నిధులతో పుట్ట కొండయ్య కాలువపై లాకుల వద్ద షట్టర్లు ఏర్పాటు చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు, జలవనరుల శాఖ అధికారుల అనుమతితోనే లాకుల వద్ద పట్టర్లు, కట్టలు ఏర్పాటుచేశామని రైతులు చెబుతున్నారు. తొలిగింపును సర్పంచి కీర్తి హరినాథబాబు ఆధ్వర్యంలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టర్లు తొలగిస్తే నీటి ఎద్దడి వస్తుందని.. పంట విరామం ప్రకటిస్తామని హెచ్చరించారు.

గోకివాడ రైతుల నిర్వాకంతో నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందడంలేదని దిగువ గ్రామాలైన రాపర్తి, పి. రాయవరం, భోగాపురం, బి.ప్రత్తిపాడు, జముపల్లి గ్రామాలకు చెందిన రైతులు పలుమార్లు కలెక్టర్‌కు స్పందనలో ఫిర్యాదు చేశారు. అనుమతి లేని నిర్మాణాన్ని తొలగించమని కలెక్టర్ కృత్తికా శుక్లా ఆదేశాలిచ్చారు. పోలీసుల భారీ బందోబస్తుతో పిఠాపురం సీఐ శ్రీనివాస్, జలవనరుల శాఖ డీఈ శ్రీను షట్టర్లు తొలగించి, అనధికారిక నిర్మాణం ధ్వంసం చేశారు. కాలువ నుంచి ఒక వంతు గోకివాడ, రెండు వంతులు దిగువ గ్రామాలకు ఇవ్వాలని గతంలో వీలునామా రాశారని రాపర్తి రైతులు చెబుతున్నారు.

అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన షట్టర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు లేవని పరిస్థితి సద్దుమణిగిందని పోలీసులు చెప్పారు. అనాధికారికంగా నిర్మించిన షట్టర్లను తొలిగిస్తున్న అధికారులు అడ్డుకునేందుకు గ్రామ రైతులతో పాటు పాల్గొన్న పోలారావు అనే రైతు మృతి చెందారు, ఆందోళన అనంతరం ఇంటికి చేరిన ఈయన ఒక్కసారిగా కుప్పకూలిపోయి చనిపోయారు. పొలాలకు నీరందనే ఆందోళనతోనే మరణించారని బంధువులు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details