YSRCP Government Laxity on Polavaram Project: పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం మరొకసారి బయటపడింది. సవరణ చేసిన అంచనాలపై అవసరమైన సమాచారం ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కోరినా స్పందన కరవైంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ పదేపదే గుర్తు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇదే అంశాన్ని కేంద్ర జల్ జల్‌శక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు.. సోమవారం రాజ్యసభలో తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక సలహా మండలి ఆమోదించిన 55వేల 548.87 కోట్ల రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్-2 పెట్టుబడుల అనుమతి ఇప్పటికీ పెండింగ్ ఉందా అని.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోమవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు.. కేంద్ర జల్‌శక్తి సహాయమంత్రి బిశ్వశ్వేర్ టుడు సమాధానం ఇచ్చారు.
బిశ్వేశ్వర్ టుడు తెలిపిన వివరాలు: 'కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్, ఫ్లడ్ కంట్రోల్, మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అడ్వయిజరీ కమిటీ.. పోలవరం ప్రాజెక్టు సెకండ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్‌కి 2017-18 ధరల ప్రకారం 55వేల 548.87 కోట్లకు ఆమోదం తెలిపింది. 2019 ఫిబ్రవరిలో జరిగిన 141వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొంది. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆ వ్యయాన్ని 2017-18 ధరలను అనుసరించి 47వేల 725.74 కోట్లకు పరిమితం చేసింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020 డిసెంబరులో RCE-2కి పెట్టుబడుల అనుమతి ఇవ్వాలని కోరుతూ.. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ప్రతిపాదనలు సమర్పించింది.
దానిపై ఏపీ ప్రభుత్వం నుంచి అదనపు సమాచారాన్ని ఇవ్వాలని అథారిటీ కోరింది. ప్రాథమికంగా సామాజిక-ఆర్థిక సర్వే నిర్వహించడంతోపాటు, డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌కి సంబంధించి డీపీఆర్ తయారు చేయాలని, కన్‌స్ట్రక్షన్ షెడ్యూల్‌ను సవరించి రూపొందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పదేపదే గుర్తుచేసినా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన దస్తావేజులను అందించలేదు' అని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు వెల్లడించారు.
సాగునీటి విభాగం నిర్మాణ ఖర్చు ఎప్పటికప్పుడే చెల్లిస్తున్నాం: 2014 ఏప్రిల్ 1 నుంచి ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణానికయ్యే మిగిలిన వ్యయాన్ని 100% సమకూరుస్తామని.. 2016 సెప్టెంబరు 30న కేంద్ర ఆర్థికశాఖ జారీచేసిన ఆఫీస్ మెమోరాండంలో చెప్పినట్లు కేంద్రమంత్రి గుర్తుచేశారు. దాని ప్రకారం ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగం నిర్మాణం కోసం పెట్టిన ఖర్చును ఎప్పటికప్పుడు తిరిగి చెల్లిస్తూ వస్తున్నట్లు తెలిపారు.
వరదలతో దెబ్బతిన్న భాగానికీ నిధులు: ఈ ప్రాజెక్టులో 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ ఉంచడానికి వీలుగా పనులు పూర్తిచేయడానికి 10వేల 911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న భాగాన్ని మరమ్మతు చేయడానికి 2 వేల కోట్ల అదనపు నిధులు ఇవ్వడానికి అభ్యంతరం లేదంటూ.. ఈ ఏడాది జూన్ 5న కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం తమకు వర్తమానం పంపినట్లు బిశ్వేశ్వర్ టుడు తెలిపారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
గతంలోని కేబినెట్ నిర్ణయాన్ని సవరిస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకొనే నిర్ణయానికి లోబడి ఇది ఉంటుందన్నారు. దీని నుంచి తాగునీటి విభాగానికయ్యే ఖర్చును మినహాయించలేదన్నారు. అలాగే ఈ ప్రాజెక్టు నిర్మాణంలో విభాగాల వారీగా విధించిన పరిమితులను తొలగించడానికి అభ్యంతరం లేదని.. అదే ఆఫీస్ మెమోరాండంలో ఆర్థికశాఖ వ్యయ విభాగం చెప్పినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల సంఘం సిఫార్సు చేసిన బిల్లులను తిరిగి చెల్లించడంలో జాప్యాన్ని నివారించడానికి.. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలిస్తున్నట్లు బిశ్వేశ్వర్ టుడు పేర్కొన్నారు.
ఏపీ జీవనాడిపై అడుగడుగునా నిర్లక్ష్యం..!