Government is Allocating Water to the Close Ones: ఉత్తరాంధ్ర, కాకినాడ జిల్లాల్లో కొన్ని గిరిజన పల్లెలు, మెట్టప్రాంతాల్లో సాగు,తాగునీటికి తాండవ, రైవాడ జలాశయాలే దిక్కు. ఆ రెండు జలాశయాలకు వచ్చే నీళ్లే తక్కువ. చచ్చీచెడీ.. సాగయ్యే భూమే 66వేల 809 ఎకరాలు. ఆ కొద్ది భూమికీ నీళ్లు ఇవ్వడమే కష్టం. తాండవ జలాశయానికి 33 సంవత్సరాలలో.. 15 ఏళ్ల పాటు నీళ్లే ఉండవని జలవనరులశాఖ అధికారులే తేల్చేశారు.
నీళ్లు లేవంటూనే.. ఆ కంపెనీలకు నీటిని కేటాయించిన ప్రభుత్వం రైవాడకూ నీటిలభ్యత అంతంతే.! అంత కరవులోనూ అస్మదీయులకు నీళ్లు ధారపోసేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏమాత్రం వెనకాడడంలేదు. జగన్‌కు సన్నిహితులైన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, కడప జిల్లాకే చెందిన షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సంస్థల జల విద్యుదుత్పత్తి కోసం నీటి.. కేటాయింపులు ఇచ్చేశారు.
అల్లూరి జిల్లా అనంతగిరి మండలం పెదకోటలో స్థానిక గెడ్డపై.. వెయ్యి మెగావాట్ల పంప్డు స్టోరేజి ప్రాజెక్టు ఏర్పాటుకు 0.393 టీఎంసీలు నీరు ఒకసారికి, 0.016 టీఎంసీల నీళ్లు ప్రతి ఏటా ఆవిరి రూపంలో నష్టపోయే నీటిని భర్తీచేసేలా ఇచ్చేందుకు.. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌కు జలవనరులశాఖ కొన్ని షరతులతో కేటాయించింది. ఇదే జిల్లాలోని చింతపల్లి మండలం ఎర్రవరం వద్ద.. శ్రీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌కు బొడ్డేరు వాగు నుంచి 0.533 టీఎంసీలు ఒకసారి.. ఆవిరి రూపంలో నష్టపోయే 0.046 టీఎంసీలు ప్రతి ఏటా మళ్లీ భర్తీచేసేందుకు వీలుకల్పిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది.
తాండవ జలాశయం కింద నాతవరం, కోటవురట్ల మండలాలతోపాటు కాకినాడ జిల్లాకు చెందిన రౌతులపూడి, కోటనందూరు, తుని మండలాల్లో సుమారు 51వేల 465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయానికి ప్రధాన నీటివనరైన బొడ్డేరు వాగుపైనే షిర్డీసాయి ఎలక్ట్రికల్స్.. వెయ్యి మెగావాట్ల పంప్డ్‌స్టోరేజి ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతోంది. ఎర్రవరం వద్ద విద్యుత్తు ఉత్పత్తికి వీలుగా 2రిజర్వాయర్లు నిర్మించనుంది. ఇందుకోసం 0.533 టీఎంసీల నీటిని ప్రభుత్వం కేటాయించింది.
అంతకుముందే.. సంబంధితశాఖ నుంచి నిరంభ్యంతర పత్రం పొందేందుకు వీలుగా నీటి లభ్యతపై సర్వే చేపట్టారు. ఇందుకు సంబంధించి జలవనరులశాఖ అధికారులు ఒక నివేదిక సమర్పించారు. ఇందులో శ్రీ షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నిర్మించ తలపెట్టిన హైడ్రోపవర్ ప్రాజెక్టు తాండవ రిజర్వాయర్ పరీవాహక ప్రాంతం పరిధిలోకి వస్తుందని.. పేర్కొన్నారు.
బొడ్డేరు వాగుపై అనకాపల్లి జిల్లా గంటావారి కొత్తగూడెం వద్ద తాండవ రిజర్వాయర్ నిర్మించారు. ఈ జలాశయం వల్ల.. 51 వేల 468 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. అనకాపల్లి జిల్లాలోనే ఇదో ప్రధాన ప్రాజెక్టు. ఈ రిజర్వాయర్‌కు నీళ్లు లేవనే ఉద్దేశంతో ఏలేరు - తాండవ అనుసంధాన ప్రాజెక్టుకు 470 కోట్ల 5 లక్షలతో.. ప్రస్తుత ప్రభుత్వం పాలనా అనుమతులు ఇచ్చింది.
2022 డిసెంబరు 30న సీఎం జగన్ శంకుస్థాపన కూడా.. చేశారు. తాండవ జలాశయానికి దారగడ్డ, బొడ్డేరు నుంచి నీళ్లు వస్తాయి. దీనికి బొడ్డేరే ప్రధాన వనరు. ప్రస్తుతం.. షిర్డీసాయి పంప్డు స్టోరేజీ ప్లాంటు బొడ్డేరుపైనే నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఎర్రవరం వద్ద ఎగువ, దిగువ జలాశయాలను చెరో 0.533 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్లు షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ డీపీఆర్‌లో పేర్కొంది.
అదానీ గ్రీన్ ఎనర్జీ నిర్మిస్తున్న పంప్డు స్టోరేజి ప్లాంటు రైవాడ జలాశయం పరీవాహక ప్రాంతం పరిధిలోకి వస్తుంది. ఈ విద్యుత్తు ప్రాజెక్టులో భాగంగా ఎగువ రిజర్వాయర్ స్థానికవాగుపై కుడియా గ్రామం వద్ద, దిగువ రిజర్వాయర్ ఈ వాగులో.. మరో వాగు వచ్చి కలిసే ప్రదేశంలో నిర్మించనున్నారు. జలవనరుల శాఖ అధికారులు ఈ పంప్డ్ స్టోరేజి ప్లాంటు ఏర్పాటు నేపథ్యంలో ఒక నివేదిక అందించారు.
అందులో.. రైవాడ జలాశయం ప్రాజెక్టు దిగువన 15 వేల 344 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయం నుంచి.. విశాఖపట్నంకు 1.581 టీఎంసీల నీరు సరఫరా చేస్తారు. విశాఖకు తాగునీరు ఇవ్వడం వల్ల ఈ ప్రాజెక్టు కింద ఇప్పటికే విజయనగరం జిల్లాలోని 6వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందడం లేదు.
జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో.. ఈ ప్రాజెక్టును సందర్శించి రైవాడ కింద నీరు అందని 6 వేల ఎకరాలకు సాగునీరు వచ్చేలా చూస్తామని.. హామీ ఇచ్చారు. ఈ పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులోని రెండు జలాశయాలకు.. వరుసగా 0.498 టీఎంసీలు, 0.607 టీఎంసీలు నీరు అవసరం అవుతుందని డీపీఆర్‌లో తెలిపారు.
అదానీ గ్రీన్ ఎనర్జీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ప్లాంట్లకు నీళ్లిస్తే దిగువనున్న తాండవ, రైవాడజలాశయాలకు నీళ్లు రావడం కష్టమేనని స్థానిక జలవనరులశాఖ అధికారులు నివేదికలో తేల్చిచెప్పారు. అలా చెబుతూనే.. కొన్ని షరతులతో నీళ్లు ఇవ్వవచ్చని చివరిలో ముక్తాయించారు. ఇంజినీర్లు రావాలనుకున్నప్పుడుప్లాంట్‌లోకి అనుమతించాలని జలవనరులశాఖ కార్యదర్శి.. జీవోలో షరతు పెట్టారు. అంత పెద్ద పారిశ్రామికవేత్తల విషయంలో దిగువస్థాయి చిన్న ఇంజినీర్లు ఆ నిబంధనలు కఠినంగా అమలుచేసే పరిస్థితులు ఉంటాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. సాగుకు, తాగునీటికి కొరత ఉందంటూనే విద్యుదుత్పత్తికి నీళ్లు కేటాయించడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇవీ చదవండి: