YSRCP Government Ignored Job Calendar JOB Calendar: ఏపీపీఎస్సీ నుంచి ఉద్యోగాల భర్తీ లేదు. ఏటా ఇస్తామన్న ఊసే లేదు. ప్రకటించిన పోస్టుల భర్తీ జాడ అసలే లేదు. రెండున్నర లక్షల ఉద్యోగాలు, ఏటా మెగా డీఎస్సీ అంటూ నిరుద్యోగుల్ని ఊరించిన జగన్ సీఎం పోస్టు పట్టేసి.. నాలుగు సంవత్సరాలు కాకమ్మ కబుర్లతోనే కాలం గడిపేశారు. నోటిఫికేషన్ల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా చేస్తామని నమ్మించి.. చివరకు నిరుద్యోగులు నీరసించిపోతున్నా స్పందించడంలేదు.
'దేవుడు ఆశీర్వాదించి.. మీ అందరి చల్లని దీవెనలతో రేపు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మొట్టమొదటిగా నేను చేయబోయేది.. గవర్నమెంటులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు రీలీజ్ చేస్తానని మీ అందరికి మాటిస్తున్నాను. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకీ క్యాలెండర్ కూడా విడుదల చేస్తానని మీ అందరికి మాటిస్తున్నాను' అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలో అన్న మాటలివి
ఈ మాటతోనే జగన్ నిరుద్యోగుల ఓట్లు కొల్లగొట్టారు. ఆయన మాత్రం సీఎం పోస్టు దక్కించుకున్నారు. ఆ తర్వాత జాబ్‌క్యాలెండర్ హామీని గాలికొదిలేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి జాబ్‌క్యాలెండర్ ప్రకటించారు. 2021 జూన్ 18న 10 వేల 143 పోస్టులతో జాబ్ క్యాలెండర్.. అంటూ ఒక ప్రచార వీడియో కూడా విడుదలచేశారు.
ఆ వీడియోలో చివరి మాటల్లో చెప్పినవే కాదు చెప్పనివీ చేయడం జగనన్న నైజమని ప్రకటించారు. ఈ నాలుగేళ్లలో ఇచ్చిన ఒకే ఒక జాబ్‌క్యాలెండర్‌లో చెప్పిందేంటో చేసిందేంటో పరిశీలిస్తే అదొక జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మిగిలిపోయింది. 2021 జాబ్ క్యాలెండర్ ప్రకారం డిగ్రీ కళాశాలల్లో 240 అధ్యాపకుల పోస్టుల భర్తీకి గతేడాది జనవరిలో వర్సిటీల్లో 2వేల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి.. గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్లు ఇవ్వాలి. కానీ నేటికీ అతీగతీ లేదు. జగన్ ఇలా మడమ తిప్పుతారని తెలియక నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతూనే ఉన్నారు.
''జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో 2 లక్షల 35వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అవి ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. పాఠశాల విద్య శాఖలోనే 43వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్రమంత్రి పార్లమెంటులో ప్రకటించారు.'' -ప్రసన్నకుమార్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు