అక్కచెల్లెమ్మల బాధ విను జగనన్నా - నేనున్నాను, నేను విన్నానంటివి కదా YCP Government Response on Anganwadi Agitation: నేను ఉన్నాను, నేను విన్నానంటూ, గత ఎన్నికల సమయంలో చెవులను మోతెక్కించిన జగన్ అధికారంలోకి వచ్చాక తూచ్ అనేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీలు మూడున్నరేళ్లుగా విన్నవిస్తున్నా సమ్మెకు వెళ్తున్నామని నోటీసులిచ్చినా, రెండు వారాలుగా ఆందోళనలు చేస్తున్నా, వైఎస్సార్సీపీ సర్కారుకు చీమ కుట్టినట్లైనా లేదు.
పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అక్కడి అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించినా, మహిళా పక్షపాతినంటూ చెప్పుకునే జగన్ కనీసం వారి గురించి పట్టించుకునే తీరకా లేనట్లు వ్యవహరిస్తున్నారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాల పెంపు చేయడం లేదని, అంగన్వాడీలు మండిపడుతున్నారు.
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ కష్టపడుతున్నా వైఎస్సార్సీపీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లపై స్పందించకపోగా, సమ్మె చేయడమే దేశద్రోహమన్నట్లు సర్కారు తీరు ఉంది. అంగన్వాడీ కేంద్రాలపై దండెత్తి, తాళాలు పగులగొట్టించడమే అందుకు నిదర్శనం.
సీఎం జగన్కు కనపడదా, వినపడదా - పన్నెండో రోజూ కదం తొక్కిన అంగన్వాడీలు
తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అక్కడి అంగన్వాడీ కార్యకర్తల వేతనాలను ఇప్పటివరకు 225 శాతం పెంచింది. 2015లో 4 వేల 500 గా ఉన్న వేతనాన్ని, ప్రస్తుతం 13 వేల 650 రూపాయలకు పెంచింది. 2015, 2017, 2021 సంవత్సరాల్లో మూడు విడతలుగా పెంచింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు 254 శాతం వేతన పెంపు అందించింది. రాష్ట్రంలోని అంగన్వాడీలకు 2019లో వెయ్యి రూపాయలు పెంచిన జగన్ ప్రభుత్వం దాన్నే గొప్పగా చెప్పుకుంటోంది.
అప్పుడే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన కష్టాలు వెంటాడుతున్నా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అంగన్వాడీలకు వేతనాల పెంపులో వెనకడుగు వేయలేదు. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం, పేదల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూనే, ఉద్యోగులకూ పెద్దపీట వేసింది.
తెలుగుదేశం పాలనలో అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని 4 వేల 200 నుంచి 10 వేల 500కి పెంచింది. రెండు విడతల్లో 150 శాతం పెంచి తెలంగాణతో సమానంగా వేతనాన్ని అందించింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 103 శాతం, ఆయాలకు 172 శాతం పెంపు అందించింది. వారికి వెసులుబాటు ఇచ్చి మరీ, అన్ని సంక్షేమ పథకాలను వారికి వర్తింపజేసింది.
ఆగని అంగన్వాడీల ఆర్తనాదాలు - హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరికలు
జగన్ అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనాన్ని 10 వేల 500 నుంచి 11 వేల 500 చేశారు. ఈ లెక్కన అక్కచెల్లెమ్మలకు జగన్ పెంచింది కేవలం 9.5 శాతమే. ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాల తర్వాత ఆదాయ పరిమితి నిబంధనను తెరమీదకు తీసుకొచ్చి, సంక్షేమ పథకాలకు ఎసరు పెట్టారు. సుమారు 51 వేల మందిపై ఆ ప్రభావం పడింది.
ఏడాది క్రితం సుప్రీం కోర్టు అంగన్వాడీలకు గ్రాట్యూటీని అమలు చేయాల్సిందిగా తీర్పునిచ్చింది. గుజరాత్‌లో దీన్ని అమల్లోకి తీసుకురాగా, కర్ణాటకలో మంత్రివర్గం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అంగన్వాడీలు నిరవధిక సమ్మెలో ఉన్నా, అదే సమయంలో మంత్రివర్గ సమావేశం జరిగినా, వారి ప్రస్తావనే రాలేదు.
సమస్యలను పరిష్కరించకుంటే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిని గద్దె దింపుతాం: అంగన్వాడీలు
పేదలపై వారి చిత్తశుద్ధి అది. ఆ తర్వాత ఎప్పుడో తీరిగ్గా విలేకరుల సమావేశంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ గ్రాట్యూటీపై కేంద్రానికి లేఖ రాశామన్నారు. అక్కడి నుంచి సమాధానం రాగానే స్పందిస్తామని దాటవేత ధోరణిలో మాట్లాడారు. మరో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంకో అడుగు ముందుకేసి అంగన్వాడీలే కోర్టుకు వెళ్లి డైరెక్షన్ తెచ్చుకోవాలని ఉచిత సలహా ఇచ్చారు. సమస్య ఉన్న ప్రతివారూ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వైఖరి.
మూడున్నరేళ్లుగా వారికున్న ఇబ్బందులపై అంగన్వాడీలు వినతులు ఇస్తూనే ఉన్నారు. వివిధ మార్గాల్లో నిరసన తెలుపుతున్నారు. అయినా ముఖ్యమంత్రి స్పందించిన దాఖలాలు లేవు. ''మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తారా?'' అంటూ రైల్వేకోడూరు ఎమ్మెల్యే తన అనుచరులతో దీక్షా శిబిరాన్నే కూలగొట్టించారు.
పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత - మంత్రి బుగ్గనకు అంగన్వాడీల వినతిపత్రం
జగన్ సొంత ఇలాకా పులివెందులలో ''సమస్యలపై మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు'' అంటూ ఆయన అనుచరులు బెదిరింపులకు దిగారు. అసలు నిరసనలే చేపట్టకుండా హుకుం జారీ చేశారు. బొబ్బిలి ఎమ్మెల్యే మరో మెట్టు దిగి మహిళలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పదవీ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష, ఆయాలకు 50 వేల రూపాయలు చెల్లించాలని, తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీలు సమ్మెకు దిగితే ఇప్పుడు ఆ మేరకు మేం కూడా చెల్లిస్తామని జగన్ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు 50 వేలు, ఆయాకు 20 వేల రూపాయల చొప్పున చెల్లించాల్సిన బకాయిలే పేరుకుపోయాయి.
తెలంగాణ ప్రభుత్వం 3 వేల 989 మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ కారణంగా మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల వేతనం 7 వేల 800 నుంచి 13 వేల 650కి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ దాదాపు 8 వేల వరకు మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిని కూడా ఉన్నతీకరించాలని కొన్నాళ్లుగా డిమాండ్ వినిపిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. ఇప్పుడేమో కేంద్ర నిబంధనలు అనుసరించి అప్‌గ్రేడ్ చేస్తున్నామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పదవీ విరమణ చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్ అందిస్తోంది. మన దగ్గర అలాంటివేవీ లేవు.
కొనసాగుతున్న అంగన్వాడీల ఆందోళన - మద్దతు తెలుపిన రాజకీయ పార్టీలు