గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కొప్పర్రుకు చెందిన దళిత యువకుడు, తెదేపా కార్యకర్త వెంకట నారాయణపై మద్యం మత్తులో కొందరు దుండగులు దాడి చేసి హత్యకు యత్నించారు. బీరు సీసాలతో తల పగులగొట్టి నిప్పంటించి పరారయ్యారు. తీవ్ర గాయాలైన బాధితుడు ప్రస్తుతం గుంటూరు బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యడ్లపాడు, ప్రత్తిపాడు మండలాల సరిహద్దులో బోయపాలేనికి సమీపంలోని పొలాల్లో ఈ ఘటన సోమవారం రాత్రి 11 గంటల సమయంలో జరగగా.. మంగళవారం ఉదయం వెలుగు చూసింది.
వంట మాస్టరుగా జీవనం సాగిస్తున్న వెంకట నారాయణ తన అత్తగారి ఊరైన పెదకూరపాడులో ఉంటున్నారు. కొప్పర్రులో ఉంటున్న తల్లిని చూడటానికి సోమవారం రాత్రి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నవ రోడ్డులోని మద్యం దుకాణానికి సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యం తాగుతున్నాడు. అప్పటికే అక్కడ మరికొందరు మద్యం సేవిస్తున్నారు. వీరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. చివరకు అది అతనిపై దాడి చేసే వరకు వెళ్లింది. తెదేపా ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు ఇంతగా లేవని, ప్రస్తుతం చేసిన చాకిరంతా దీనికే సరిపోతుందని బాధితుడు అనగా.. ప్రత్యర్థులు ఒక్కసారిగా అతనిపై బీరు సీసాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం పత్తి చేలో పడేసి వెళ్లిపోయారు. 40శాతానికి పైగా కాలిన గాయాలైన బాధితుడు వెంకట నారాయణ సోమవారం రాత్రి నుంచి ఘటన ప్రదేశంలోనే ఉన్నాడు. మంగళవారం ఉదయం సమీపంలో ఉన్న నూలు మిల్లు వద్దకు వెళ్లాడు. అక్కడి వాచ్‌మన్ చూసి 108కు సమాచారమివ్వగా వారు వచ్చి జీజీహెచ్‌లో చేర్పించారు.
తీవ్రంగా ఖండిస్తున్నా: లోకేశ్
దళితుడైన వెంకట నారాయణను మద్యం సీసాలతో కొట్టి నిప్పంటించిన రాక్షస మూకల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేశ్ పేర్కొన్నారు. ‘తప్పును తప్పని చెబితే చంపేస్తారా? మనుషుల ప్రాణాలే తీసేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.
రాజకీయ ప్రమేయం లేదు: డీఎస్పీ