అమరావతికి మద్దతుగా ఉద్యమిస్తున్న మహిళా రైతులను అవహేళన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టినందుకు గుంటూరు జిల్లా తుళ్లూరులో యువకుడికి మహిళలు, రైతులు దేహశుద్ధి చేశారు. ఓ వైపు బతుకు పోరాటం చేస్తుంటే ఇలా అవహేళన చేయడం ఏంటంటూ అతనిపై మండిపడ్డారు.
అమరావతి ఉద్యమం 300వ రోజున తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తుళ్లూరులోని ధర్నా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తమ దుస్థితిని రైతులు, మహిళలు ఆయనకు వివరించారు. ఇదే అంశాన్ని హేళన చేస్తూ తుళ్లూరుకు చెందిన యువకుడు పోస్టులు పెట్టడంపై రైతులు, మహిళలు ఆగ్రహించి అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నారు.