"ఎయిడెడ్ పాఠశాలలు స్వాతంత్య్రానికి ముందునుంచే ఉన్నాయి. తొలినాళ్లలో వీటి ద్వారానే చాలామందికి విద్య అందింది. ఇలాంటి వ్యవస్థలను ప్రభుత్వం బలవంతంగా తీసుకుంటోంది" అని ఎయిడెడ్ విద్యాసంస్థల కరస్పాండెంట్లు ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వం దీనికి స్వస్తి పలకాలని, జీఓ నంబరు 50ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఆదివారం గుంటూరులో పలు జిల్లాల ఎయిడెడ్ విద్యాసంస్థల సెక్రటరీ, కరస్పాండెంట్లు సమావేశమై ప్రస్తుత పరిణామాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎయిడెడ్ యాజమాన్యాల సంఘం (ప్రాస్మా) రాష్ట్ర నాయకుడు మైలా అంజయ్య మాట్లాడుతూ పాఠశాలల నిర్వహణకు గ్రాంట్లు, పోస్టుల భర్తీకి అనుమతులు ఇవ్వకుండా ప్రభుత్వాలే ఎయిడెడ్ విద్యాలయాలను నిర్వీర్యం చేస్తూ వస్తున్నాయని ధ్వజమెత్తారు. తనిఖీ కమిటీలు పాఠశాలల పరిశీలనకు వెళ్లినప్పుడు పిల్లలు లేరనే సాకుతో ఉన్న ఉపాధ్యాయులను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని కోరటం, తమకు గ్రాంటు ఇన్ ఎయిడ్ వద్దని లేఖలు ఇవ్వాలనడం సమంజసం కాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.