'చంపుతామని బెదిరిస్తున్నారు..కాపాడండి' - issue
భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించి, అదేంటని అడిగిన తమను చంపుతామని బెదిరిస్తున్నారని.. గుంటూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ వద్ద 30 లక్షలు స్వాహా చేశారంటూ బాధితులు వాపోయారు. నగదు తిరిగి ఇవ్వమంటే రాజకీయ నాయకుల పేరు చెప్పి బెదిరిస్తున్నారని ఆరోపించారు.
తమను చంపుతామని బెదిరిస్తున్న వారిపై గుంటూరుకు చెందిన వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను మోసగించిన హోంగార్డు అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పొత్తూరి రామకృష్ణారావు రెడ్డిపాలెంలోని 1380 గజాల స్థలాన్ని తమకు విక్రయించారంటూ.. గుంటూరుకు చెందిన అమర్నాథ్ రెడ్డి, వెంకటేశ్వరరావు, వెంకటరెడ్డి, రవిశంకర్ అనే నలుగురు వ్యక్తులు చెబుతున్నారు. గజం 18 వేల రూపాయల చొప్పున మొత్తం 2కోట్ల 40 లక్షలకు ఒప్పందం చేసుకున్నామని, ముందుగా 30 లక్షలు తీసుకున్నారని చెబుతున్నారు. రెండు నెలల్లోగా రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నామన్నారు. స్థలం పత్రాలు తీసుకుని పరిశీలిస్తే ఎన్ఆర్ఐకి చెందిన స్థలంగా తెలిసిందని బాధితులు వాపోతున్నారు. వెంటనే స్థలం వద్దని.. చెల్లించిన నగదు తిరిగి ఇవ్వమంటే చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుల్లో ఒకరైన వెంకటరెడ్డి ఆరోపిస్తున్నారు. వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని.. న్యాయం చేయాలంటూ పట్టణ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు.