అతనో వీఆర్వో. రైతులు సమస్యలు పరిష్కరించమని వస్తే అతనిలోని లంచగొండి నిద్రలేస్తాడు. అతను డిమాండ్ చేసే లంచాన్ని తీసుకోవడానికి ఓ ప్రైవేటు వ్యక్తిని నియమించుకొని.. అతనికి నెలనెలా కొంత ముట్టజెపుతున్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో. గుంటూరు జిల్లాలో ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయాలు తెలిశాయి.
జిల్లాలోని దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు వద్ద నుంచి 15 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ముటుకూరు-2 గ్రామ వీఆర్వో అందుగుల రాజారావు ఏసీబీ అధికారులకు చిక్కాడు. కంచరగుంట గ్రామానికి చెందిన బాల సైదారావు అనే రైతుకు మూడెకరాల పొలం ఉంది. దానిని పాసు పుస్తకంలో ఆన్లైన్ చేసేందుకు వీఆర్వో రాజారావును కలిశాడు. అతను రూ.15వేలు లంచం డిమాండ్ చేశాడు. తన వద్ద పని చేస్తున్న చింత నాగమణికంఠకు ఆ డబ్బును ఇవ్వాలని రైతులు సూచించాడు. అంత డబ్బు ఇచ్చుకోలేని రైతు బాల సైదారావు గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.