ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Vignan University: 'యువత డబ్బు వెంట కాదు... ఆలోచనల వెంట పరిగెత్తాలి'

Vignan University Convocation: విద్యార్థులు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో నాయకునిగా ఎదగాలని విజ్ఞాన్​ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో ప్రముఖులు సూచించారు. ఆయా రంగాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని, వాటిని ఆకలింపు చేసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని తెలిపారు. రానున్న కాలంలో విద్యుత్ వాహనాలదే భవిష్యత్తని.. నాలుగు కోట్ల ఉద్యోగాలు ఆ రంగంలో ఉన్నాయని తెలిపారు.

vignan convocation
vignan convocation

By

Published : Sep 22, 2022, 9:41 PM IST

Updated : Sep 22, 2022, 10:37 PM IST

Vignan University Convocation: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం 10వ స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరి ముఖ్య అతిథిగా హాజరు కాగా... భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ చైర్మన్, ఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, బాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్, హైదరాబాద్‌లోని ఆస్త్రా మైక్రోవేవ్‌ ప్రొడక్ట్స్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ ఎంవీ.రెడ్డికి గౌరవ డాక్టరేట్లు అందజేశారు. ప్రముఖ సినీ సంగిత దర్శకులు ఎం.ఎం.కీరవాణికి కూడా డాక్టరేట్ ప్రకటించినా వ్యక్తిగత కారణాలతో ఆయన హాజరు కాలేకపోయారు.

Lavu Rathaiah: విజ్ఞాన్ విద్యా సంస్థల ఛైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలన్నారు. ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో నాయకునిగా ఎదగాలన్నారు. అలాగే ఆయా రంగాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించాలని, వాటిని ఆకలింపు చేసుకుని అభివృద్ధికి బాటలు వేసుకోవాలని సూచించారు.

Central minister Nitin Gadkari: ఆటోమొబైల్ రంగంలో విద్యుత్ వాహనాలదే భవిష్యత్తని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం అగ్రగామిగా ఎదగాలంటే వ్యవసాయరంగంలో వృద్ధిరేటు పెరగాలన్నారు. రహదారులు, ఫ్లై ఓవర్లు నిర్మాణం విషయంలో తనకు పేరొచ్చినా... వ్యవసాయం అంటే చాలా ఇష్టమని తెలిపారు. జలవనరులు, ఓడరేవుల మంత్రిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానానికి, పోలవరం నిర్మాణానికి, బంకింగ్ హాం కెనాల్ జల రవాణాకు కృషి చేసిన విషయాలు గుర్తు చేసుకున్నారు. వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం నూనెల దిగుమతికి ఖర్చు అవుతోందని... దాన్ని తగ్గించేందుకు దేశీయంగా ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు, సహజ వనరుల ద్వారా ఇంధనం తయారీ చేసే విధానాలు అభివృద్ధి చెందాలన్నారు. నాలుగు కోట్ల ఉద్యోగాలు ఎలక్ట్రిక్ వాహన రంగంలో ఉన్నాయని... దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా పెరగడంలో ఈ రంగం కీలకం కానుందని వివరించారు. యువ ఇంజనీర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగాలు చేసేవారిగా కాకుండా.. పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చదువు, విజ్ఞానంతో పాటు సామాజిక బాధ్యత, దేశం పట్ల బాధ్యత చాలా ముఖ్యమని గడ్కరీ స్పష్టం చేశారు.

కృష్ణ ఎల్ల, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ

Krishna Ella: నేటి యువతరం డబ్బు వెంట కాకుండా ఆలోచనల వెంట పరిగెడితే ఉన్నత స్థానాలకు ఎదుగుతారని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ చైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. తాము చదువుకునే సమయంలో పోలిస్తే ఇప్పుడు ఉన్నత విద్యావకాశాలు పెరిగాయన్నారు. ఏ విషయాన్నయినా నిశితంగా పరిశీలించటం అలవర్చుకుంటే.. అద్భుతమైన ఆలోచనలు వస్తాయని తెలిపారు. ఆలోచనలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయని, పైకి తీసుకు వస్తాయని వివరించారు. సమాజంలోని సమస్యలను పరిష్కరించడం ద్వారానే నేర్చుకున్న విద్యకు సార్థకత వస్తుందని కృష్ణ ఎల్ల తెలిపారు.

స్నాతకోత్సవంలో 1842 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. అలాగే ఆయా విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి బంగారు పతకాలు అందజేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2022, 10:37 PM IST

ABOUT THE AUTHOR

...view details