Road Accidents : గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. చేబ్రోలు మండలం వడ్లమూడి వద్ద ఈ ప్రమాదం జరిగింది. తెనాలిలో ముఖ్యమంత్రి సభ కోసం బొలెరో వాహనానికి కట్టుకుని తీసుకెళ్తున్న జనరేటర్ ఎవ్వరూ ఊహించని ఈ ప్రమాదానికి కారణమైంది. వడ్లమూడి-గరుగుపాలెం మధ్యలో జనరేటర్ బొలెరో నుంచి విడిపోయింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన జనరేటర్ ని తెనాలి నుంచి వస్తున్న ఆటో, కారు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో ఇద్దరు, ఆసుపత్రి తరలించాక మరో వ్యక్తి మృతి చెందారు. ప్రమాదంలో మరో 13మందికి గాయాలయ్యాయి. వీరంతా తెనాలి మండలం దిండిపాలెంకు చెందిన వారిగా గుర్తించారు. వారంతా మిర్చి కోతలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వడ్లమూడిలోని డీవీసీ ఆసుపత్రి, గుంటూరు జీజీహెచ్, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటో గేదెను ఢీకొని..పెడన మండలం నందమూరు వద్ద నిన్న సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బందరు మండలం గిలకలదిండికి చెందిన కుటుంబం కలిదిండి నుంచి ఆటోలో తిరిగి వెళ్తుడగా.. నందమూరు వద్ద గేదెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడగా అందులో ప్రయాణిస్తున్న పీతా కన్నారావు (70) అక్కడికక్కడే మృతి చెందాడు. పీతాజ్యోతి, పీతాలక్ష్మి, పీతాదేవి, ఓడుగు చంద్రవతి, చింతా విజయదుర్గతో పాటు డ్రైవర్ ఓడుగు వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగ్రాతులను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.