పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాల్లో కూడా మార్పు రావాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి అన్నారు. 'భారత ప్రజాస్వామ్య వ్యవస్థ - ఎన్నికల విశ్లేషణ' అనే అంశంపై గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేశారు. పార్లమెంటులో 60 సీట్ల నుంచి 12 సీట్లకు పడిపోయామని... మూడు రాష్ట్రాల్లో అధికారం నుంచి ఇపుడు ఒకే రాష్ట్రానికి పరిమితమయ్యామని అన్నారు. దీన్నిబట్టి వామపక్షాలు వ్యూహం మార్చాల్సిన అవసరం ఏర్పడిందని విశ్లేషించారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా వామపక్షాలు చేపట్టిన వివిధ రకాల ఉద్యమాల్లో 6 కోట్ల మంది కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, చిరుద్యోగులు పాల్గొన్నారని... కానీ సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఓట్లు చూస్తే కోటి లోపే ఉన్నాయన్నారు. ఉద్యమాలకు ఎర్రజెండా... ఓటు మాత్రం వేరే జెండాకు అన్నట్లుగా ప్రజలు వ్యవహరిస్తున్నారని ఇది తప్పకుండా ఉద్యమాలకు నాయకత్వం వహించేవారి లోపమేనని స్పష్టం చేశారు. ఉద్యమ విధానాన్ని రాజకీయ విధానంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. యువతని ఆకర్షించేలా వామపక్షాలు ప్రయత్నించాలని సూచించారు.
''భాజపాకు హిందూ మహిళల సమానత్వం అక్కర్లేదా?'' - triple talaq
వామపక్షాల్లో సమూల మార్పు రావాల్సిన అవకాశం ఉందని సీతారాం ఏచూరి అన్నారు. పోరాటాలకు ఎర్రజెండా... ఓటు మాత్రం వేరే జెండాకు అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చు, ధన ప్రవాహం వల్లే భాజపా అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఇక దేశంలో మతాల మధ్య చిచ్చుతో పాటు ధన ప్రవాహం వల్లే భాజపా అధికారంలోకి వచ్చిందని... ఇది చాలా ప్రమాదకరమైన ధోరణిగా అభివర్ణించారు. కొన్నిచోట్ల భాజపా అభ్యర్థులు ఎవరో తెలియకుండానే ప్రజలు ఓట్లేశారని చెప్పారు. త్రిపుల్ తలాక్ తో ముస్లిం మహిళలకు సమాన హక్కు కట్టబెట్టామని చెబుతున్న మోదీ, అమిత్ షా.... శబరిమల ఆలయంలోకి ప్రవేశం విషయంలో హిందూ మహిళల హక్కులను ఎందుకు పరిరక్షించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. భాజపాకు హిందూ మహిళల సమానత్వం అక్కర్లేదా అని ప్రశ్నించారు. భాజపా వ్యతిరేక శక్తులంతా ఒకతాటిపైకి రావటం ద్వారా మాత్రమే మళ్లీ పూర్వవైభవం వస్తుందని అభిప్రాయపడ్డారు.