ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పల్లెపోరు ముగియగానే.. పురపాలక ఎన్నికలకు సన్నాహాలు

By

Published : Feb 14, 2021, 2:15 PM IST

బాపట్ల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియగానే పురపాలక ఎన్నికలు నిర్వహించటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. బాపట్ల పట్టణంలో శివారు గ్రామాల విలీనంపై కోర్టు వ్యాజ్యాలు ఉండటంతో గతేడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. పురపాలక సంఘంలో ఎనిమిది శివారు గ్రామాలను అధికారికంగా విలీనం చేస్తూ గత డిసెంబరు 31న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

The state election commission is preparing to hold municipal elections once the countryside is over
పల్లెపోరు ముగియగానే పురపాలక ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు

గుంటూరు జిల్లా బాపట్ల గ్రామ పంచాయతీల ఎన్నికలు ముగియగానే పురపాలక ఎన్నికలు నిర్వహించటానికి రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. బాపట్ల పట్టణంలో శివారు గ్రామాల విలీనంపై కోర్టు వ్యాజ్యాలు ఉండటంతో గతేడాది మార్చిలో ఎన్నికల ప్రక్రియ చేపట్టలేదు. పురపాలక సంఘంలో ఎనిమిది శివారు గ్రామాలను అధికారికంగా విలీనం చేస్తూ గత డిసెంబరు 31న ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తాజాగా కలిసిన గ్రామాలతో కలిపి వార్డుల పునర్విభజన చేసి ప్రతిపాదనలను అధికారులు ప్రజలు, రాజకీయ పక్షాల ముందు అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. పట్టణంలో కొత్తగా గ్రామాలు వచ్చి కలిసినా వార్డుల సంఖ్య పెంచకుండా 34 వార్డులే ఉంటాయని స్పష్టం చేశారు. వార్డుల విభజన గందరగోళంగా ఉందంటూ పలువురు ఫిర్యాదులు చేశారు. వార్డుల రిజర్వేషన్‌, పోలింగ్‌బూత్‌ల వారీగా ఓటర్ల జాబితాలు ఇంకా సిద్ధం కాలేదు. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ ఇచ్చినా బాపట్ల పురపాలిక ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అని రాజకీయ పక్షాల్లో సందేహాలు నెలకొన్నాయి.

పునర్విభజన జరిగిందిలా..

శివారు గ్రామాల విలీనానికి ముందు పురపాలక సంఘంలో 34 వార్డులు ఉన్నాయి. ఎనిమిది గ్రామాలను పట్టణంలో కలిపాక చేపట్టిన వార్డుల పునర్విభజనలో 34 వార్డులతోనే అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. పాత వార్డులు రద్దు కాగా విలీన గ్రామాలతో కొత్తవి ఏర్పాటు చేశారు. గతంలో రైలుపేటలో ఎనిమిది వార్డులు ఉండేవి. ప్రస్తుతం అవి ఆరుకు తగ్గిపోయాయి. నందిరాజుతోటను తొమ్మిదో వార్డుగా, కొండుభొట్లపాలేన్ని పదో వార్డుగా ఏర్పాటు చేశారు. వల్లువారిపాలేన్ని 11వ వార్డులో చేర్చారు. ముత్తాయపాలేన్ని 20వ వార్డుగా, సూర్యలంక, రామ్‌నగర్‌, ఆదర్శనగర్‌, హనుమంతనగర్‌, మద్దిబోయినవారిపాలెంలో దక్షిణ భాగాన్ని 21వ వార్డుగా ప్రతిపాదించారు. మరుప్రోలువారిపాలెం, ఆసోదివారిపాలేన్ని 22వ వార్డుగా, పడమర బాపట్లలోని దరివాదకొత్తపాలెం, మహాత్మాజీపురం, కుక్కలవారిపాలెం, నాగేంద్రపురం, వైఎస్‌ఆర్‌ కాలనీ, సుబ్బారెడ్డిపాలేన్ని కలిపి 34వ వార్డుగా ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో గతంలో ఉన్న ఆరు వార్డులు తగ్గిపోగా, విలీన గ్రామాలతో కొత్తగా ఆరు ఏర్పడ్డాయి.

హైకోర్టులో వ్యాజ్యాలు

శివారు గ్రామాల విలీనం వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. అవి విచారణ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2020 మార్చిలో బాపట్ల పురపాలక సంఘంలో నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా వేశారు. గ్రామాలను విలీనం చేస్తూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఆర్డినెన్స్‌ వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అధికారులు మాత్రం ఎన్నికల నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ అంతా గందరగోళంగా ఉందని ప్రతిపక్ష తెదేపా, జనసేన నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి సైతం పునర్విభజన ప్రతిపాదనలు ఎవరికీ అర్థం కావటం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కొండుభొట్లపాలెం, నందిరాజుతోట గ్రామాలను వేర్వేరు వార్డులుగా కాకుండా రెండు గ్రామాల్లో భాగాలను కలుపుతూ రెండు వార్డులుగా ఏర్పాటు చేయటంపై తెదేపా నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19 నాటికి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని తప్పులు సరిదిద్ది తుది ప్రతిపాదనలను ప్రచురించటానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కసరత్తు చేస్తేనే..

వార్డుల విభజన ప్రక్రియ పూర్తయ్యాక రిజర్వేషన్లు ఖరారు చేయాలి. వార్డుల వారీగా పోలింగ్‌బూత్‌లు, ఓటర్ల జాబితాలు రూపొందించాలి. ఈ ప్రక్రియ పూర్తి చేయటానికి పది రోజుల గడువే ఉంది. ఎస్‌ఈసీ పురపాలక ఎన్నికల ప్రకటన విడుదల చేయటానికి ముందే కసరత్తును ఓ కొలిక్కి తీసుకురావాలి. విలీన గ్రామాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పురపాలక సంఘాలన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

పారదర్శకంగా ప్రక్రియ : బాపట్లలో వార్డుల పునర్విభజన పారదర్శకంగా చేపడుతున్నాం. విభజనపై వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని లోపాలు గుర్తించి సరిదిద్దుతున్నాం. ఎన్నికల నిర్వహణ విషయంలో ఎస్‌ఈసీదే తుది నిర్ణయం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. - భానుప్రతాప్‌, కమిషనర్‌

సంపూర్ణంగా విలీనమైన గ్రామ పంచాయతీలు : కొండుభొట్లపాలెం, తూర్పుబాపట్ల, మరుప్రోలువారిపాలెం, పడమర బాపట్ల, సూర్యలంక, ముత్తాయపాలెం

పాక్షికంగా విలీనమైనవి : ఆసోదివారిపలెం, వల్లువారిపాలెం

విలీనానికి ముందు పట్టణ జనాభా : 70,777

విలీనం తరువాత : 1.07 లక్షలు

విలీనానికి ముందు ఓటర్ల సంఖ్య : 55,801

ప్రస్తుతం : 71,293 (2020 మార్చి 7 నాటికి)

గతంలో పోలింగ్‌బూత్‌లు : 56 ● ప్రస్తుతం : 73

ఇదీ చదవండి:

నేడు సంజీవయ్య శత జయంతి

ABOUT THE AUTHOR

...view details