BR STADIUM : గుంటూరు నగరానికి నడిబొడ్డున.. 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బ్రహ్మానందరెడ్డి స్టేడియానికి ఘనమైన చరిత్ర ఉంది. 1967లో నిర్మాణమైన ఈ మైదానం.. ఐదు దశాబ్దాలుగా ఎందరో మేటి క్రీడాకారులను దేశానికి అందించింది. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ వంటి క్రీడాకారులు ఇక్కడే ఓనమాలు దిద్దారు. పీటీ ఉష జాతీయస్థాయి పోటీల్లో ఈ మైదానంలోనే పరుగెత్తింది. 1980-1990 మధ్య పలు క్రికెట్ రంజీ మ్యాచ్ లు జరిగాయి. వివిధ క్రీడాంశాలకు సంబంధించి జాతీయ, రాష్ట్రస్థాయి పోటీలకు బీఆర్ స్టేడియం వేదికగా నిలిచింది.
గుంటూరు ఖ్యాతిని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన క్రీడాకారులు వందల సంఖ్యలో ఉన్నారు. ఇంతమంది క్రీడాకారులను జాతికి అందించిన బీఆర్ మైదానం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడో కట్టిన గ్యాలరీలు పూర్తిగా విరిగిపోయాయి. చిన్నపాటి వర్షం కురిసినా... మైదానం పూర్తిగా నీటితో నిండిపోతుంది. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు కరవయ్యాయి. సమస్యలను అధిగమించేందుకు గత ప్రభుత్వం బీఆర్ స్టేడియాన్ని ప్రైవేట్ భాగస్వామ్యంతో పునర్నిర్మించాలని తలపెట్టింది. ఒకే స్టేడియంలో ఇండోర్, ఔట్ డోర్ మైదానాలు కలిసుండేలా చేయాలనుకున్నారు. ఆధునిక హంగులతో మైదానాన్ని 270 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలని ప్రతిపాదనలు ఘనంగానే పంపించారు. కానీ, ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి.