గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల తొలగింపు ఉద్రిక్తంగా మారింది. రోడ్డు విస్తరణ పేరుతో.. గత 30 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఉంటున్న వారిని అధికారులు బలవంతంగా తొలగించారు. అధికారుల తీరును నిరసిస్తూ బాధితులు మంగళగిరి - విజయవాడ రహదారిపై బైఠాయించారు. దీంతో సుమారు మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో చర్చించారు. తాము గత 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని, ఇంటి పన్ను, విద్యుత్ బిల్లులు అన్నీ సకాలంలోనే చెల్లిస్తున్నామని బాధితులు చెప్పారు. తమ వేదన పట్టించుకోకుండా.. అధికారులు కులం పేరుతో తిడుతున్నారని ఆరోపించారు.